కాస్త... ఉపశమనం

Reduced High Temperatures Effect In AP - Sakshi

తగ్గిన ఉష్ణోగ్రతల ప్రభావం 

వడగాలుల తీవ్రత తగ్గుముఖం 

ఉత్తరాంధ్రలో అక్కడక్కడా వర్షాలు! 

ఏప్రిల్‌ మూడో వారం నుంచి ప్రీ మాన్‌సూన్‌  

సాక్షి, విశాఖపట్నం: కొన్ని రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరయిన రాష్ట్రం.. శనివారం కాస్త చల్లబడింది. ఇన్నాళ్లూ 45 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు సముద్ర గాలులు బలంగా వీయడం వల్ల.. వడగాలుల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దక్షిణ కోస్తా నుంచి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర వైపు గాలులు విస్తరిస్తుండగా.. మధ్య భారత దేశం నుంచి గాలులు వీస్తూ.. ఉత్తరాంధ్ర కొండల ప్రాంతాల్లో కలవడం వల్ల.. అక్కడక్కడా అకాల వర్షాలు కురిశాయి.

ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో శనివారం ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కురుస్తాయనీ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలిక పాటి వానలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ గాలుల కారణంగా.. రాయలసీమలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని నిపుణులు తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్‌ 14 తర్వాత ప్రీ మాన్‌సూన్‌ సీజన్‌ ప్రారంభమై.. రాష్ట్రంలో తేలికపాటి వానలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు.  

ఏపీ తీరంలో ఉపరితల ఆవర్తనం..
ఉత్తర అండమాన్‌లో వాయుగుండం మయన్మార్‌ తీరంవైపు కదులుతూ క్రమంగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ తీరం, పరిసర ప్రాంతాల్లో 2.1 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో.. తిరుపతిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కర్నూలులో 41.2, కడపలో 40.6, అనంతపురంలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పాలవలసలో సూరిబాబు(45) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top