
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం విశాఖ తీరానికి అతి సమీపంలో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.
దీంతో విశాఖ, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు 20 వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
అల్పపీడన ప్రభావంతో రానున్న రెండ్రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు.. సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి.
కాపులుప్పాడలో అత్యధికంగా 154మి.మీ వర్షపాతం..
గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లాలోని కాపులుప్పాడలో 154 మి.మీ, పరదేశీపాలెంలో 142.25, భీమిలిలో 134, పాడేరులో 133.75, ఆనందపురంలో 131.5, మధురవాడలో 129 మి.మీ వర్షపాతం నమోదైంది.
కల్లోల తీరం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మత్స్యకారులు తమ వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో పర్యాటకుల్లేక సముద్ర తీరం బోసిపోయింది. – వాకాడు(తిరుపతి జిల్లా)