‘గెస్టు’కు రెగ్యులర్‌ గుబులు | Recruitment in BC Gurukuls: Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘గెస్టు’కు రెగ్యులర్‌ గుబులు

Jun 23 2025 5:35 AM | Updated on Jun 23 2025 5:35 AM

Recruitment in BC Gurukuls: Andhra pradesh

కాంట్రాక్ట్‌ స్కూల్స్‌లో రెగ్యులర్‌ టీచర్స్‌గా మార్పు చేసేందుకు బీఓజీ అజెండాలో 13వ అంశం

జీవో 23 నిబంధనలను బేఖాతరు చేస్తూ బీసీ గురుకులాల్లో నియామకాలు

మంత్రి సవిత అధ్యక్షతన నేడు బీఓజీ సమావేశంలో ఆమోదానికి రంగం సిద్ధం 

రాష్ట్రంలో 65 బీసీ గురుకులాల్లో 715 కాంట్రాక్ట్‌ పోస్టులకు ఎసరు 

కాంట్రాక్ట్‌ పోస్టులతోపాటు 1,253 గెస్ట్‌ టీచర్స్‌ భవితవ్యానికి చేటు

సాక్షి, అమరావతి: అడ్డగోలు నిర్ణయాలతో అభాసుపాలవడం బీసీ సంక్షేమ శాఖ బాధ్యులకు పరిపాటిగా మారింది. కాంట్రాక్ట్‌ స్కూల్స్‌లో తాజాగా మంజూరైన కాంట్రాక్ట్‌ టీచర్స్‌ పోస్టులను రెగ్యులర్‌ పోస్టులుగా మార్చేందుకు గట్టి యత్నాలే జరుగుతున్నాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత అధ్యక్షతన సోమవారం నిర్వహిస్తున్న బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీఓజీ) సమావేశంలో కాంట్రాక్ట్‌ స్కూళ్లలోని 715 కాంట్రాక్ట్‌ పోస్టులను రెగ్యులర్‌ పోస్టులుగా మార్చేందుకు ప్రతిపాదించారు. దీనిని ఆ సమావేశ అజెండాలోని 13వ అంశంగా ఆమోదించేందుకు ముందస్తు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా.. 
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల పరిధిలో 2019లో కొత్తగా 65 బీసీ గురుకులాలు ఏర్పాటు చేశారు. వాటిలో 65 రెగ్యులర్‌ ప్రిన్సిపాల్స్, 715 మంది టీచర్లను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయాలని అప్పట్లో జారీ చేసిన జీవో నంబర్‌ 23లో స్పష్టం చేశారు. అప్పటినుంచి వాటిలో కాంట్రాక్ట్‌ టీచర్స్‌ నియామకం లేకపోవడంతో గెస్ట్‌ ఫ్యాకల్టీ లతో నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్‌ స్కూల్స్‌లోని 715 పోస్టులతోపాటు మరికొన్ని గురుకులాలతో కలిపి మొత్తం 1,253 మంది గెస్ట్‌ టీచర్స్‌ 5 నుంచి 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  జీవో నంబర్‌ 23లో పేర్కొన్న నిబంధనలను కాదని.. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం కాంట్రాక్ట్‌ స్కూల్స్‌లోని పోస్టులను రెగ్యులర్‌గా మారిస్తే గెస్ట్‌ టీచర్స్‌ రోడ్డున పడే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం తక్షణం కాంట్రాక్ట్‌ స్థానంలో రెగ్యులర్‌ టీచర్స్‌ను పెట్టే ప్రతిపాదన విరమించుకుని కాంట్రాక్ట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి గెస్ట్‌ టీచర్లకు వెయిటేజీ ఇచ్చి భర్తీ చేయాలని కోరుతున్నారు.  

జగన్‌ మేలు చేస్తే.. కూటమి కక్ష కట్టింది 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తమకు మేలు జరగ్గా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష గట్టిందని గెస్ట్‌ టీచర్లు వాపోతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022లో మోడల్‌ స్కూల్స్‌లో 282 కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. గెస్ట్‌ టీచర్లకు 20 మార్కుల వెయిటేజీ ఇచ్చి భర్తీ చేసింది. రాష్ట్రంలో 106 బీసీ గురుకులాల్లో టెన్త్‌ విద్యార్థులు 2023–24లో 98.8 శాతం, 2024–25లో 95 శాతం ఉత్తీర్ణత సాధించడంలో గెస్ట్‌ టీచర్స్‌ పాత్ర కీలకం. కనీసం వారు డీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యేందుకూ కూటమి ప్రభుత్వం సెలవు ఇవ్వలేదు. డీఎస్సీ కోచింగ్‌కు వెళ్లిన వారిని బీసీ గురుకుల సొసైటీకి రానిచ్చేది లేదంటూ ఇటీవల సర్క్యులర్‌ కూడా జారీ చేసింది. అటు డీఎస్సీ కోచింగ్‌ తీసుకునే అవకాశం లేకుండా చేసి.. ఇటు ఉన్న పోస్టులకే ఎసరు పెడితే తాము ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడతామని గెస్ట్‌ టీచర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement