
మాట్లాడేదేం లేదని తేల్చి చెప్పిన డీజీలు
సమావేశానికి రావాలని సీఎస్ చేసిన ప్రతిపాదనకు తిరస్కరణ
డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తా తీరు సరి కాదని స్పష్టీకరణ
డీజీల తిరుగుబాటుతో ప్రభుత్వంలో కలవరం
సీఎస్ ద్వారా రాయబారం నడిపిన సీఎం చంద్రబాబు
బెడిసికొట్టిన సర్కారు రాజీ యత్నాలు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారుల తిరుగుబాటు బావుటా పోలీసు శాఖలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఏకపక్ష వైఖరిపట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న డైరెక్టర్ జనరల్(డీజీ)స్థాయి అధికారులను బుజ్జగించేందుకు ప్రభుత్వం చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. అసంతృప్తితో ఉన్న డీజీలను ప్రత్యేక భేటీకి పిలిచి సర్దిచెప్పేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) విజయానంద్ చేసిన యత్నాలు ఫలించలేదు. పోలీసు శాఖతోపాటు యావత్ ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో సంచలనంగా మారిన పరిణామాలు ఇలా ఉన్నాయి.
మాట్లాడుకుందాం రండి..డీజీలకు సీఎస్ పిలుపు
డీజీస్థాయి ఐపీఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉండటం ప్రభుత్వ పెద్దలను కలవరానికి గురి చేసింది. తమ ఒంటెత్తు పోకడలతో విసిగి వేసారిన సీనియర్ ఐపీఎస్ అధికారులు అసంతృప్తితో సహాయనిరాకరణ చేస్తే ప్రభుత్వం అభాసుపాలవుతుందని ఆందోళన చెందింది. దాంతో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాలు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించాయి.
ఐపీఎస్ అధికారుల బదిలీలూ చేపట్టలేని నిస్సహాయ స్థితి ప్రభుత్వానికి అవమానకరమేనని అధికారవర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసంతృప్తితో ఉన్న డీజీలను డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తాను సమావేశపరిచి సర్దుబాటు చేయాలని ఆయన సీఎస్ కె.విజయానంద్‌ను ఆదేశించినట్టు సమాచారం.
ఫలితంగా విజయానంద్ డీజీస్థాయి ఐపీఎస్ అధికారులకు గురువారం కబురు పంపించారు. ఓసారి సమావేశమై మాట్లాడుకుందామని చెప్పారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా కూడా ఆ సమావేశంలో పాల్గొంటారని అన్ని విషయాలనూ మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుందామని చెప్పారు. డీజీలు సమావేశానికి వస్తే ఏదో విధంగా వ్యవహారాన్ని సర్దుబాటు చేయాలని ఆయన భావించారు.
అన్నీ మీకు తెలుసు కదా... మేమెందుకు రావాలి...!? డీజీల తిరస్కరణ
సీఎస్ ప్రతిపాదనను డీజీలు తిప్పికొట్టారు. ఈ సమావేశానికి తామెందుకు రావాలని ఎదురు ప్రశ్నించారు. అధికారిక సమావేశమా? అనధికారిక సమావేశమా? అని కూడా సూటిగా ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పలేకపోయారు. అఖిలభారత సర్వీసులకు చెందిన సీనియర్ అధికారి అయిన సీఎస్‌కు ప్రభుత్వ పాలన, ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉంటుంది.
ఆ నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రస్తుతం పోలీసు శాఖలో సాగుతున్న వ్యవహారాలు కూడా ఆయనకు తెలుసు. అంతగా సర్దుబాటు చేయాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అవకతవకలను సరిదిద్దాలని డీజీలు వ్యాఖ్యానించారు. అంతేగానీ తామంతట తాము వచ్చి తమకు జరుగుతున్న అవమానాలు, నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగుల గురించి ఎందుకు ఏకరువు పెట్టాలని ప్రశ్నించారు. రిటైర్మెంట్‌కు కేవలం రెండు నెలల ముందు రెగ్యులర్ డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను ఎలా నియమిస్తారని డీజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
డీజీపీగా నియమితులైన తరువాత కూడా కీలకమైన విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఆయనే చీఫ్‌గా ఉండటం.. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీఐడీ విభాగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని ఆ విభాగం డీజీని నామమాత్రపు పాత్రకు పరిమితం చేయడం.. అగ్నిమాపక శాఖ డీజీని బదిలీ చేసి ఆ స్థానంలో ఐజీస్థాయి అధికారిని నియమించాలని భావించడం... సీఐడీ, విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్, అగ్నిమాపక శాఖల చీఫ్‌లుగా జూనియర్ అధికారులను నియమించి తానే నియంత్రించాలని యోచించడం.. ఇవన్నీ డీజీపీ గుప్తా చేస్తున్న అవకతవక పనులే కదా అని డీజీలు సూటిగానే సీఎస్‌తో వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఈ విషయాలన్నీ తెలిసిన తరువాత ఆ తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప .. తాము వచ్చి తమ అభ్యంతరాలు వెల్లడించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డీజీలకు లెవల్ 17 పేస్కేల్ అమలు చేయాలని తాము ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలుచేసి తీరుతామని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదే రీతిలో గుర్తింపు లేకుండా చేసి అవమానిస్తే తాము మరింత తీవ్ర నిర్ణయం తీసుకునేందుకూ వెనుకాడబోమని డీజీలు కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామం ప్రస్తుతం పోలీసు శాఖతోపాటు ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.