‘కనెక్టివిటీ’ బాదుడు | Ready to impose additional burden on power producers | Sakshi
Sakshi News home page

‘కనెక్టివిటీ’ బాదుడు

Jun 15 2026 3:00 AM | Updated on Jun 15 2026 3:01 AM

Ready to impose additional burden on power producers

విద్యుత్‌ ఉత్పత్తిదారులపై అదనపు భారం మోపేందుకు సిద్ధం  

ట్రాన్స్‌మిషన్, వీలింగ్‌ ఛార్జీలతో మరింత పెరగనున్న వ్యయం

సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులపై సాంకేతికత పేరుతో బాదుడు  

పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించేలా ఏపీ ట్రాన్స్‌కో నిబంధనలు 

∙ఇప్పటికే ‘కనెక్టివిటీ’ ఒప్పందం పేరుతో ‘ఏపీఈఆర్‌సీ’కి ముసాయిదా 

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ఉత్పత్తిదారులపై అదనపు భారం మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ ట్రాన్స్‌కో) లిమిటెడ్‌ సిద్ధమైపోయింది. రాష్ట్రంలో విద్యుత్‌ గ్రిడ్‌కు అనుసంధానం కావాలనుకునే విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమలు, భారీ విద్యుత్‌ వినియోగదారులపై ఆర్థిక భారం వేయడానికి రంగం సిద్ధం చేసింది. గ్రిడ్‌లోకి విద్యుత్‌ను పంపినా, తీసుకున్నా అదనపు చార్జీలు మోపుతూ ‘కనెక్టివిటీ ఒప్పందం’ పేరుతో ముసాయిదా నిబంధనలు రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) అనుమతి కోసం పంపిన ముసాయిదాలో అనేక సాంకేతిక, ఆర్థిక భారాలను పూర్తిగా వినియోగదారులపైనే మోపడం చర్చనీయాంశంగా మారింది. 

విద్యుత్‌ ఉత్పత్తిదారులు 132 కేవీ పైబడి ఉన్న కనెక్షన్లకు ఏపీ ట్రాన్స్‌కోతో, 33 కేవీ స్థాయిలో ఉన్న వాటికి ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కొత్తగా గ్రిడ్‌కు అనుసంధానమయ్యే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు సింక్రనైజేషన్‌కు ముందే ఒప్పందం కుదుర్చుకోవాలి. అలాగే కొత్త వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా ప్రారంభించే ముందు ఈ ఒప్పందం అమలులో ఉండాలి. ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థలు, వినియోగదారులు మూడు నెలల్లోగా ఒప్పందాలను పూర్తి చేయాలి. ఒప్పందం వరకే అయితే పర్లేదు కానీ ఆ తర్వాత మోపే భారాలను చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయంటున్నారు పారిశ్రామికవేత్తలు.  

ఒప్పందం చేసుకోకుంటే జరిమానాలు  
ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా విద్యుత్‌ వినియోగం లేదా విక్రయం జరిగితే ట్రాన్స్‌మిషన్, వీలింగ్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గ్రిడ్‌కు అనుసంధానం కోసం అవసరమైన ఇంటర్‌ కనెక్షన్‌ సదుపాయాల నిర్మాణ వ్యయం మొత్తాన్ని అభివృద్ధిదారులు లేదా వినియోగదారులే భరించాలి. అంతేకాకుండా నిర్వహణ, మరమ్మతులు, పరికరాల మార్పిడి ఖర్చులు కూడా వారిపైనే ఉంటాయి. దీంతో కొత్తగా విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలపై అదనపు భారం పడనుంది. 

ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా విద్యుత్‌ విక్రయాలు లేదా వినియోగం చేపట్టే సంస్థలు ట్రాన్స్‌మిషన్, వీలింగ్, ఆంధ్రప్రదేశ్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఏపీఎస్‌ఎల్‌డీసీ) ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెరుగుతున్న నిర్వహణ వ్యయాలకు ఇవి అదనంగా చేరనున్నాయి. వాణిజ్య ఒప్పందం లేకుండా గ్రిడ్‌లోకి విద్యుత్‌ను పంపినా, గ్రిడ్‌ నుంచి తీసుకున్నా జరిమానాలు, అదనపు చార్జీలు విధిస్తామని ముసాయిదా హెచ్చరిస్తోంది. విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న చిన్న సంస్థలకు ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

సౌర, పవన ప్రాజెక్టులపై కఠిన నిబంధనలు  
సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులు లో ఓల్టేజ్‌ రైడ్‌ త్రూ(ఎల్‌వీఆర్‌టీ), హై ఓల్టేజ్‌ రైడ్‌ త్రూ(హెచ్‌వీఆర్‌టీ), రియాక్టివ్‌ పవర్‌ సపోర్ట్‌ వంటి ప్రత్యేక సాంకేతిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదనంగా పవర్‌ కంట్రోల్‌ వ్యవస్థలు కూడా తప్పనిసరి చేశారు. దీంతో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రతి ప్రాజెక్టు ఏపీఎస్‌ఎల్‌డీసీతో అనుసంధానమయ్యేలా స్కాడా, కమ్యూనికేషన్, డేటా టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు కూడా పూర్తిగా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే మీటరింగ్, రక్షణ వ్యవస్థలు, పరికరాల పరీక్షలు, నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు వంటి ఖర్చులన్నీ వినియోగదారులపైనే వేశారు. వీటిలో ఏవైనా లోపాలు తలెత్తినా సంబంధిత సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.  

కొత్త నిబంధనలపై పరిశ్రమవర్గాల్లో ఆందోళన  
ఇప్పటికే విద్యుత్‌ రంగంలో పెట్టుబడుల వ్యయం పెరుగుతున్న నేపధ్యంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ప్రైవేట్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు, పరిశ్రమలు వెనుకడుగు వేసే అవకాశముందని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో కొత్త పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఇంధనరంగ నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఈ నిబంధనలన్నీ గ్రిడ్‌ భద్రత, విద్యుత్‌ నాణ్యత, వ్యవస్థ విశ్వసనీయత కోసం అవసరమని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను వెల్లడించాల్సిందిగా  (ఏపీఈఆర్‌సీ) ఆహ్వానించింది. ఈ – మెయిల్‌ లేదా పోస్టు ద్వారా జూన్‌ 19 లోపు కమిషన్‌ కార్యదర్శికి పంపవచ్చని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement