
నోట్ బుక్స్ తెచ్చుకోని బీఎల్‌వోలను నిల్చోబెట్టిన ఆర్డీవో
మీడియా ప్రతినిధులపై మైకు విసరబోయిన వైనం
నంద్యాల: నంద్యాల ఆర్డీవో వ్యవహార శైలి వివాదాస్పదమైంది. బీఎల్‌వోలను కించపరచడంతో పాటు కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మైకు విసరబోవడం, దుర్భాషలాడటం చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. నంద్యాల జిల్లా మండల కేంద్రం చాగలమర్రిలోని వాసవీ కళ్యాణ మండపంలో మండల ఇన్‌చార్జి తహసీల్దార్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బిఎల్‌వోలకు ఒక్క రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఆర్డీవో విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ సునీల్‌పై కేకలు వేశారు. బీఎల్‌వోలకు శిక్షణ సరిగ్గా ఇవ్వడం లేదంటూ ఇందుకేనా ప్రభుత్వం మిమ్మల్ని శిక్షణకు ఢిల్లీకి పంపిందని ప్రశ్నించారు. విధి నిర్వహణకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడానికి డైరీలు, నోట్ బుక్స్ తెచ్చుకోకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. నోట్ బుక్స్ తెచ్చుకోని వీఆర్‌ఓలను విద్యార్థుల్లా నిల్చోబెట్టి పొడుపు కథలు చెప్పారు.
ఇది మా కార్యక్రమం.. మీరెందుకొచ్చారు?
శిక్షణ కార్యక్రమం కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా ఆర్డీఓ విశ్వనాథ్ దురుసుగా ప్రవర్తించారు. ఇది మా సిబ్బందికి సంబంధించినదని, మీరు బయటికి వెళ్లండంటూ గట్టిగా అరిచారు. అక్కడితో ఆగకుండా చేతిలోని మైకును విసరబోయారు. పక్కనే ఉన్న స్థానిక తహసీల్దార్ వారించడంతో ఆర్డీఓ కోపోద్రిక్తుడై దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.