రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు | Sakshi
Sakshi News home page

రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు

Published Wed, Oct 18 2023 1:24 AM

Ramoji Rao forged our signatures says Yuri Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ‘రామోజీరావు పచ్చి మోసం చేశారు. తొలుత మమ్మల్ని ఓ గదిలో నిర్బంధించి, తుపాకీతో బెదిరించి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నించారు. ప్రాణా లు దక్కించుకొనేందుకు ఆయనిచ్చిన ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టి బయట పడ్డాం. షేర్లు మాత్రం బదిలీ చేయలేదు. ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలతో మాకున్న 288 షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు బదలాయించుకున్నారు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి చెప్పారు.

తమ షేర్లను బదిలీ చేసి రామోజీ మోసానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఐడీని, న్యాయస్థానాన్ని కోరారు. యూరి రెడ్డి మంగళవారం తన న్యాయవాది శివరామిరెడ్డితో కలిసి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రామోజీరావు ఏ విధంగా తమ షేర్లను అక్రమంగా బదలాయించుకున్నదీ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

తుపాకితో బెదిరించి..
మా తండ్రి జీజే రెడ్డి చనిపోయిన తరువాత మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా అన్నయ్య మార్టిన్‌ రెడ్డి, నేను మా వాటా షేర్ల కోసం ఎన్నో ఏళ్లు రామోజీరావును సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  చివరికి 2016లో హైదరాబాద్‌లో ఆయన్ని కలిశాము. మాకు డివిడెండ్‌ కింద చెక్‌ ఇచ్చారు. ఆ తరువాత మా షేర్లపై సర్టిఫికెట్‌ అడిగితే ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు.

మమ్మల్ని లోపల ఉంచి తలుపులు వేసేశారు. చాలాసేపటి తరువాత రామోజీరావు వచ్చి ఖాళీ స్టాంపు పేపర్లు ముందు పెట్టారు. వాటిపై సంతకాలు చేయమన్నారు. మేము నిరాకరించడంతో మా తలలకు తుపాకి గురి పెట్టి ‘సంతకాలు పెడతారా లేదా.. మిమ్మల్ని  కాపాడేవారు ఎవరూ లేరు ఇక్కడ’ అని బెదిరించారు. అది ఆయన సామ్రాజ్యం. అంతా ఆయన మనుషులే. మా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు.

ఆ సమయంలో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. ఆయనకు ఎదురు చెబితే ప్రాణాలు దక్కవన్నది అర్థమైంది. కేవలం ప్రాణాలు కాపాడుకొనేందుకే ఆ ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు చేసి బయటకు వచ్చాం. షేర్ల బదిలీకి మేము అంగీకరించలేదు. షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయలేదు. రామోజీరావు మాకు ఇచ్చిన చెక్‌ను కూడా నగదుగా మార్చుకోలేదు.

చట్ట ప్రకారం ఇది చెల్లదు
కంపెనీల చట్టం ప్రకారం ఏదైనా షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలంటే మూడు అంశాలు తప్పనిసరి. ప్రతిపాదన (ఆఫర్‌), ఆమోదం (యాక్సెప్టెన్సీ), ప్రతిఫలం బదిలీ (కన్సిడరేషన్‌) తప్పనిసరి. మా షేర్ల బదిలీ విషయంలో ఆ మూడూ జరగలేదు. షేర్లు బదిలీ చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ప్రతిపాదనే లేదు. రామోజీరావు కోరినా మేము ఆమోదించలేదు. అందువల్ల యాక్సెప్టెన్సీ లేదు. మా షేర్ల బదిలీకి ప్రతిఫలంగా మాకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలమూ దక్కలేదు. కాబట్టి మేము షేర్లు విక్రయించామన్న రామోజీరావు వాదన చెల్లదు. ఆయన వాదన పూర్తిగా అబద్ధం, మోసపూరితం.

చేతి అప్పు అంటూ బుకాయింపు
మా తండ్రికి చేతి అప్పుగా ఇచ్చిన దానికి ప్రతిఫలంగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి నిధిని సమకూర్చారని రామోజీరావు ముందుగా బుకాయించారు. చేతి అప్పు తీర్చాలి అంటే నగదు ఇస్తారు గానీ కంపెనీలో పెట్టుబడి పెడతారా అని మేము ప్రశ్నిస్తే రామోజీరావు సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం షేర్లు బదిలీ చేయాలని మమ్మల్ని తుపాకీతో బెదిరించారు.

ఫోర్జరీ సంతకాలతో షేర్ల బదిలీ.. ఆర్‌వోసీకి ఫిర్యాదు
మేము సమ్మతించకపోయినా, చెక్‌ను నగదుగా మార్చుకోకపోయినా మా వాటా 288 షేర్లను రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్‌ పేరిట అక్రమంగా బదిలీ చేశారని 2017లో గుర్తించాం. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ)కి వెళ్లి సంబంధిత పత్రాలను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. పలు పత్రాల్లో మా సంతకాలను ఫోర్జరీ చేశారు. దీనిపై అప్పట్లోనే ఆర్‌వోసీకి ఫిర్యాదు చేశాను.

సీఐడీ దర్యాప్తుతో ధైర్యం వచ్చి..
రామోజీరావు తుపాకీతో బెదిరించారని కొందరికి మా ఆవేదన చెప్పుకున్నా అప్పట్లో ఫలితం లేకపోయింది.  దాంతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఆయన రాజకీయ పరపతి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వ్యవస్థలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల సొమ్ము అక్రమ పెట్టుబడులకు మళ్లించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ రామోజీ, ఇతరులపై కేసు నమోదు చేసింది.

సోదాలు నిర్వహిస్తోంది. దాంతో మాకు ధైర్యం వచ్చింది. అందుకే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని సీఐడీకి కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాము. సీఐడీ అధికారులు నాలుగైదు నెలలపాటు మా ఫిర్యాదును పరిశీలించారు. ఆధారాలు తెమ్మన్నారు. మేము ఇచ్చిన ఆధారాలను పరిశీలించారు. మా ఫిర్యాదు సరైనదే అని నిర్ధారించుకున్న తరువాతే కేసు నమోదు చేశారు.

మూలధన నిధి ఏపీ నుంచే వచ్చింది కాబట్టి..
మా తండ్రి జీజే రెడ్డి కృష్ణా జిల్లాలోని తన వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్నే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టారు. అంటే మూలధన నిధిని ఏపీ నుంచే సమీకరించారు. ఆ పెట్టుబడితోనే మా పేరిట 288 షేర్లు వచ్చాయి. ఆ షేర్లనే రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్‌ పేరిట అక్రమంగా బదిలీ చేశారు. అందుకే ఈ కేసు ఏపీకి సంబంధించినదని న్యాయ నిపుణులు చెప్పారు. దాంతోనే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశాం. మాకు జరిగిన అన్యాయంపై సీఐడీని సంప్రదించాం. సీఐడీ, న్యాయస్థానం మా ఆవేదనను గుర్తించి న్యాయం చేస్తాయని విశ్వసిస్తున్నాం.

శైలజ పేరిట అప్పుడు 100 షేర్లే..
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజ కిరణ్‌ పేరిట 2017 వరకు 100 షేర్లే ఉన్నాయి. జీజే రెడ్డి పేరిట మాత్రం 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి షేర్లను అక్రమంగా బదిలీ చేసిన తరువాత ప్రస్తుతం శైలజ కిరణ్‌ పేరిట 388 షేర్లు ఉన్నాయి. 

జీజే రెడ్డి తప్ప మిగిలిన షేర్‌ హోల్డర్లంతా రామోజీ కుటుంబ సభ్యులే
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆరుగురు షేర్‌ హోల్డర్లే ఉన్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఏనాడూ పబ్లిక్‌ ఇష్యూ జారీ చేయలేదు. ఉన్న ఆరుగురు షేర్‌ హోల్డర్లలో అయిదుగురు రామోజీరావు కుటుంబ సభ్యులే. జీజే రెడ్డి ఒక్కరే బయట వ్యక్తి. ఆయన పేరిట ఉన్న షేర్లను కూడా అక్రమంగా శైలజ కిరణ్‌ పేరిట బదిలీ చేశారు. ఆ అక్రమ వ్యవహారానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని ఇతర షేర్‌ హోల్డర్లు.. అంటే రామోజీ కుటుంబ సభ్యులు సహకరించారు. రామోజీరావు పెద్ద గూడుపుఠాణికి పాల్పడ్డారు.  

Advertisement
Advertisement