దగా డీఎస్సీపై మెగా కవరింగ్‌.. | Psychological attacks on DSC victims who spoke to YS Jagan | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై మెగా కవరింగ్‌..

Jun 6 2026 5:19 AM | Updated on Jun 6 2026 5:19 AM

Psychological attacks on DSC victims who spoke to YS Jagan

ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి కాల్‌ లెటర్లు పంపిన ప్రభుత్వం

సర్టిఫికెట్లలో తప్పులుంటే రిజెక్ట్‌ లిస్టులో.. అంతా బాగుంటే ఎంపిక లిస్టులో ఉండాలి 

కాల్‌ లెటర్లు ఇచ్చి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక వారినెందుకు ఈ రెండు లిస్టుల్లోనూ చూపలేదు? 

తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సర్కారు తంటాలు..  

1:1కు కొత్త భాష్యం.. సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినంత మాత్రాన ఎంపికైనట్టు కాదట! 

వైఎస్‌ జగన్‌తో మాట్లాడిన డీఎస్సీ బాధితులపై మానసిక దాడులు 

వారిని తప్పుగా చిత్రీకరించేందుకు టీడీపీ పెయిడ్‌ వీడియోలు

సాక్షి, అమరావతి: మొత్తం మోసాలతో సాగిన దగా డీఎస్సీ–2025పై చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడుతోంది. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన అభ్యర్థులపై పెయిడ్‌ వీడియోలతో మానసిక దాడులకు దిగుతోంది. ముఖ్యంగా డీఎస్సీలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం 1:1 నిష్పత్తి (ఒక పోస్టుకు ఒక్క అభ్యర్థి) ప్రకారం కాల్‌ లెటర్లు అందుకుని మోసానికి గురైన అభ్యర్థులు ఇటీవల వివిధ సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నారు. అలాగే, ‘సాక్షి’ పత్రికను ఆశ్రయించారు. 

అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. వీరి గురించి పత్రికల్లో రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీడీపీ పెయిడ్‌ ఫ్యాక్టరీ ఆర్టిస్టులు చెలరేగి ‘ఫేక్‌’ ప్రచారానికి దిగారు. అలాగే, నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు 1:1 నిష్పత్తికి కొత్త అర్థం చెప్పింది. కాల్‌ లెటర్లు వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చినట్టు భావించవద్దని ఆ లెటర్లలోనే ఉందని అధికారులు చెప్పడం విస్తుగొల్పుతోంది. 

రెండు జాబితాల్లోనూ వీరి పేర్లెందుకు లేవు? 
డీఎస్సీలో అభ్యర్థులకు పంపిన కాల్‌ లెటర్లకు ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. మెరిట్‌ లిస్టు ప్రకటించే ముందే అన్ని రిజర్వేషన్లు.. వర్టికల్, హారిజాంటల్‌ (ఉమెన్, స్పోర్ట్సు, ప్రత్యేక అవసరాలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌) పరిశీలించి తుది మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో మెరిట్‌ ఆధారంగానే అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో అంటే.. ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలన కోసం పిలుస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనలో అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారు. సర్టిఫికెట్లు సరిగా లేనివారిని ‘తిరస్కరణ’ జాబితాలో పెట్టి, వీరి స్థానంలో తర్వాత మెరిట్‌ (ఓపెన్‌ లేదా అదే రిజర్వేషన్‌) అభ్యర్థికి కాల్‌ లెటర్‌ పంపుతారు. 

16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఇదే సూత్రం అనుసరించినట్టు విద్యా శాఖ చెప్పడం లేదు. ప్రస్తుతం అన్యాయానికి గురై, ఉద్యోగం రాక ఆందోళన చేస్తున్న దాదాపు 1,500 మంది అభ్యర్థులు కాల్‌ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారే. వారి సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో తిరస్కరణకు గురవలేదు. జిల్లాల్లో ప్రదర్శించిన ‘రిజెక్ట్‌’ జాబితాలోనూ వీరు లేరు. అంటే వారు ఎంపిక జాబితాలో తప్పనిసరిగా ఉండాలి. అందులోనూ లేరు. వీరిని ఈ రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదో అధికారులు చెప్పడంలేదు. 

అలాగే, ‘కాల్‌ లెటర్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు మాత్రమే.. ఉద్యోగానికి ఎంపికైనట్టు కాదు’ అని ముందే చెప్పామని భాష్యం చెబుతున్నారు. 1:1 నిష్పత్తిలో పంపిన అన్ని కాల్‌ లెటర్లకు ఇదే వర్తిస్తుంది. మరి కొందరే ఎందుకు అన్యాయానికి గురయ్యారనేది పెద్ద ప్రశ్న!

డీఎస్సీ మెరిట్‌ బాధిత అభ్యర్థులను ‘ఫేక్‌’ అంటూ తప్పుడు పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్‌ మీడియా   

బాధిత అభ్యర్థులపై దుష్ప్రచారం
కాల్‌ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యి ఎంపిక, తిరస్కరణ జాబితాల్లో పేర్లు లేని అభ్యర్థులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. వారిపై ఎదురు దాడికి దిగుతోంది. పత్రికల్లో, సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా అభ్యర్థులపై దుష్ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్న అభ్యర్థులపై పెయిడ్‌ ఆర్డిస్టులు తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. మరోపక్క అభ్యర్థుల మెరిట్‌ను సైతం అధికారులు రోజుకోలా మార్చేస్తున్నారు.

» చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.ఏకాంబరం బీసీ–డి కేటగిరీకి చెందినవారు. ఇతనిది  మెరిట్‌ జాబితాలో 125వ ర్యాంకు. జిల్లాలో బీసీ–డి కేటగిరిలో 7 పోస్టులు ఉండగా, 5 మెరిట్, 2 హారిజాంటల్‌ రిజర్వేషన్‌లో భర్తీ చేశామని అధికారులు చెప్పారు. ఈ మెరిట్‌ (5 పోస్టులు)లో చివరి ర్యాంకు 114లో ఉన్న అభ్యర్థికి ఇచ్చామని గత శనివారం పాత్రికేయుల సమావేశంలో అధికారులు ధ్రువీకరించారు. కానీ శుక్రవారం ఈ మెరిట్‌ 116 అభ్యర్థికి ఇచ్చినట్టు ప్రకటించారు. ఇందులో ఏది సరైనది? వాస్తవానికి అధికారులు చెబుతున్న 114 ర్యాంకు అదే జిల్లాకు చెందిన ఎస్టీ అభ్యర్థిది. ఈ ర్యాంకును బీసీ–డిలో చూపడం విస్తుగొల్పుతోంది. అలాగే, 116 ర్యాంకు మహిళది.

» అంకాని నాగవేణి (బీసీ–ఎ) విషయంలోనూ ఇలాగే చెప్పుకొచ్చారు. ఈ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే అంతే సంఖ్యలో మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. మరి 8వ అభ్యర్థిగా ఉన్న నాగవేణికి ఎందుకు కాల్‌లెటర్‌ పంపారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రకటించిన ఏడుగురు మెరిట్‌ అభ్యర్థుల్లో ఎవరికైనా సరైన సర్టిఫికెట్లు లేక, రిజెక్ట్‌ అయిన సమయంలోనే 8వ అభ్యర్థికి కాల్‌లెటర్‌ పంపాలి. అలా ఎందుకు చేయలేదు? 

» ఉన్న పోస్టులకు అంతే సంఖ్యలో మెరిట్‌ ప్రకారం కాల్‌లెటర్లు పంపితే.. అదనపు అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చారు? వారికి కాల్‌ లెటర్లు ఎందుకు పంపినట్టు? సర్టిఫికెట్లు ఎందుకు పరిశీలించినట్టు? ఇలా సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అయినప్పటికీ అంతా సక్రమమే అనే కలరింగ్‌ ఇస్తూ చేసిన తప్పును ఒప్పు అని భ్రమింపజేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement