
ఓ వ్యక్తి ప్రాణాలకు హాని జరిగితే అతని కుటుంబానికి పూడ్చలేని నష్టం జరుగుతుంది
అందువల్ల ఆ వ్యక్తి భద్రతకు ఆదేశాలిస్తున్నాం
వైఎస్సార్‌సీపీ నేత రామలింగారెడ్డికి 1+1 భద్రత కల్పించండి
కడప జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: తనకు ప్రాణహాని ఉన్నందున భద్రత కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి తమను ఆశ్రయిస్తే దానిని తాము సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. అతని ప్రాణాలకు హాని జరిగితే దానివల్ల ఆ వ్యక్తి కుటుంబానికి పూడ్చలేని నష్టం జరుగుతుందని తెలిపింది. అందువల్ల ఆ వ్యక్తికి భద్రత కల్పించాలని ఆదేశాలు ఇస్తున్నామని తెలిపింది. వైఎస్సార్‌సీపీ నేత లింగాల రామలింగారెడ్డికి 1+1 భద్రతను పొడిగించాలని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది.
భద్రతకు అయ్యే ఖర్చులను భరించాలని రామలింగారెడ్డికి స్పష్టంచేసింది. మూడునెలల తరువాత క్షేత్రస్థాయిలో అప్పటికున్న వాస్తవ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లింగాల రామలింగారెడ్డి భద్రత విషయంలో ఉన్నతాధికారులకు తగిన సిఫారసు చేయాలని భద్రత సమీక్ష కమిటీ (ఎస్‌ఆర్‌సీ)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
భద్రత ఉపసంహరణపై పిటిషన్..
2020లో అప్పటి ప్రభుత్వం తనకు ఇచ్చిన 1+1 భద్రతను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాలుచేస్తూ వైఎస్సార్ కడప జిల్లా, వేముల గ్రామానికి చెందిన లింగాల రామలింగారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్‌కున్న 1+1 భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలుచేసింది. భద్రతను పునరుద్ధరించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. అయినా కూడా రామలింగారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పునరుద్ధరించలేదు. దీంతో.. ఆయన జిల్లా ఎస్పీపై తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
కీలక అంశాలను పట్టించుకోలేదు..
పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి, పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. భద్రత సమీక్ష కమిటీ అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పిటిషనర్ వ్యాపార, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నందున ఆయనకున్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకుంటూ 1+1 భద్రతను పొడిగించాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.