నిజాయితీకి బదిలీ బహుమానంగా ఇచ్చిన ఎమ్మెల్యే వరద
40 రోజులకే సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు
తక్కువ రోజుల్లోనే అసాంఘిక శక్తుల్లో వణుకు పుట్టించిన సీఐ
అర్ధాంతర బదిలీలతో అధికారుల్లో అభద్రతాభావం
సాక్షి ప్రతినిధి, కడప: అధికార పార్టీ నాయకులు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేసే నిజాయితీ అధికారులను వేధింపులకు గురిచేస్తున్నా రు. డూడూ బసవన్నలకు అగ్రపీఠం వేస్తూ.. నిబంధనలకు అనుగుణంగా పనిచేసే అధికారులపై ఆరోపణలు గుప్పిస్తూ వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నా రు. విధి నిర్వహణలో నిజాయితీ, నిక్కచ్చితత్వంతో వ్యవహరిస్తే రాత్రికి రాత్రే బదిలీ బహుమానంగా సత్కరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఖాకీపై ఖద్దరు స్వారీ చేస్తోంది. ఇన్నాళ్లు అవినీతి అధికారులంటూ గగ్గోలు పెట్టిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాజాగా నిజాయితీ అధికారిని మండలం రోజుల వ్యవధిలో సాగనంపడం చర్చనీయాంశమైంది.
ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా శ్రీరామ్ డిసెంబర్ 18న బాధ్యతలు చేపట్టారు. తన సహజశైలికి అనుగుణంగా విధి నిర్వహణలో నిక్కచ్చితత్వం, నిజాయితీగా ఉద్యోగ బాధ్యతలు కొనసాగించారు. విధుల్లో చేరగానే రౌడీ షిటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు చేపట్టరాదని, తద్వారా క్రైమ్‌రేట్ పెరుగుతుందని, నిబంధనలు మేరకు మద్యం షాపుల నిర్వహణ కొనసాగాలని కట్టడి చేశారు. సామాన్య ప్రజలు స్వేచ్ఛగా రక్షణ కోసం ఆశ్రయించే అవకాశం కల్పించారు. అంతేనా ‘ఇంత వరకు ఏం చేశారో నాకు అనవసరం.. ఇకపై మర్యాదగా నడుచుకోండి... గొడవలకు పాల్పడినా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా ఇంటి వద్ద నుంచే నడిపించుకుంటూ స్టేషన్‌కు తీసుకొస్తాను’అని రౌడీమూకల ను హెచ్చరించారు. సీఐ చేసిన ఈ ఒక్క హెచ్చరికతోనే వన్‌టౌన్ ఏరియాలోని అసాంఘిక శక్తుల్లో అలజడి మొదలైంది. కొందరు తట్టాబుట్టా సర్దుకొని ఊరొ దలి వెళ్లిపోయారు. ఇంకొందరు మట్కా, క్రికెట్ జూదాలు వదలిపెట్టారు. వేకువ జాము నుంచే తెరుచుకునే మద్యం షాపు లు, బార్లు నిర్ణయిత సమయానికి తెరుచుకోవడం ఆరంభించాయి. అంతే... సరిగ్గా 40రోజుల వ్యవధిలో ‘బదిలీ’ ఉత్తర్వులందాయి.
ఎమ్మెల్యే వరదను కలవని సీఐ
నిజాయితీ అధికారికి ఎవరైనా సరే వ్యక్తిత్వం మెండుగా ఉంటుంది. బదిలీపై రాగా నే సంబంధిత స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టి విధి నిర్వహణలో తలమునకలు కావడం సహజం. అచ్చం అలాంటి ధోరణితోనే ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ వ్యవహరించా రు. కొంతమంది పోలీసు అధికారులలాగా ఎమ్మెల్యేను ప్రస న్నం చేసుకునే పనిలో నిమగ్నం కాలేదు. ఇటీవల కాలంలో పోస్టింగ్ రాగానే పోలీసు అధికారులు కొంతమంది పూల బొకేలు ఇచ్చి ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీ నేతల్ని ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాగా కర్నూలు జిల్లాలోని ఆదోనిలో పని చేస్తున్న శ్రీరామ్ గతేడాది డిసెంబర్ 18న ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయనతో పాటు బదిలీపై వచ్చిన మరో ఇద్దరు సీఐలు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. ఆయన కుమారుడు కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ మాత్రం ఎమ్మెల్యేను కలవలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది అధికార పార్టీ నేతలకు నచ్చలేదు. ఆపై నిక్కచ్చితత్వంతో విధి నిర్వహణలో మునిగిపోవడం కూడా వారికి కంటగింపుగా మారిందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
అవినీతిపై ఆరోపణలు సరే...చిత్తశుద్ధి ఏది...
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆ మధ్య సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలోకి వెళ్లి ‘ఇకపై అవినీతి చేయం..’ అంటూ ఉద్యోగులతో ప్రమాణం చేయించారు. కొద్దికాలం తర్వాత ప్రొద్దుటూరు డీఎస్పీ భావనపై ప్రెస్‌మీట్ పెట్టి అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఆపై డీఎస్పీ బదిలీ అయ్యారు. కాగా సీఐగా 40రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ లంచానికి దూరంగా విధి నిర్వహణలో నిజాయితీగా పనిచేస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి, బదిలీ చేయించడంపై ఎమ్మెల్యే వదరరాజులరెడ్డి డొల్లతనం బహిర్గతమవుతోంది. నిత్యం అధికారుల అవినీతిపై ఆరోపణలు చేసే ఎమ్మెల్యే నిజాయితీ అధికారికి మద్దతి వ్వకపోవడంపై పలువురు నిలదీస్తున్నారు.
జీ...హుజూర్ అంటే ఎదురుండదు...
విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత చాటుకునేవారు కరువు అవుతున్నారా... అధికారం, అక్రమార్జనకు బానిసలయ్యే అధికారులే అధికమయ్యారా... ఖద్దరు నేతలు ఆదేశిస్తే జీ...హుజుర్ అంటూ తలాడిస్తూ చెప్పిందే తడువుగా ఖాకీలు పనిచేస్తున్నారా... అంటే ‘అవును’అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చట్టానికి అనుగుణంగా అడుగులు వేసే నాలుగో సింహం కనుమరుగు అవుతోంది. రాజకీయ నాయకుల ప్రాపకం కోసం, ఆ మాటున అక్రమార్జన కోసం పరితపిస్తూ వ్యవస్థకు మచ్చ తెస్తున్న కొంతమంది అధికారులపై ఎలాంటి చర్యలుండవు.
ఉచ్చం నీచం అన్న తేడా లేకుండా పులివెందుల సబ్ డివిజన్‌లో కొందరు పోలీసు అధికారులు పనిచేస్తున్నారనే ఆరోపణలు క్రమం తప్పకుండా తెరపైకి వస్తున్నాయి. ఎక్కడో హైదరాబాద్, విజయవాడలల్లో నివసించేవారిపై కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ నేతలు స్వయంగా ఇళ్లుకు వెళ్లి కొట్టుకుంటూ దౌర్జన్యంగా తీసుకెళ్లి నిర్భందిస్తున్నా కేసులు నమోదు కావడం లేదు. ఇంకోవైపు ఎస్‌ఐ స్థాయి వారిని టీడీపీ నేతలు పరుషంగా దూషించినా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తెలుగుతమ్ముళ్లు అనువైన ప్రాంతాల్లో జూదం విచ్చలవిడిగా కొనసాగుతోంది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. కారణం ఖద్దరు నేతల్ని ప్రసన్నం చేసుకోవడమేనని పలువురు వివరిస్తున్నారు. మొత్తంగా పరిశీలిస్తే ఖాకీలపై ఖద్దరు స్వారీ చేయడం.. ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


