బలవంతపు బదిలీలు | Pressure on SAs to fill PSHM posts: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బలవంతపు బదిలీలు

Jun 2 2025 3:50 AM | Updated on Jun 2 2025 3:50 AM

Pressure on SAs to fill PSHM posts: Andhra Pradesh

పీఎస్‌ హెచ్‌ఎం పోస్టుల భర్తీకి ఎస్‌ఏలపై తీవ్ర ఒత్తిడి 

చట్టం చేసి.. పాటించని కూటమి ప్రభుత్వం 

సీనియారిటీ ప్రకటించకుండానే వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలని ఒత్తిడి 

అభాసుపాలవుతున్న ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025  

ఎస్జీటీల పదోన్నతులకు గండి  

ఎప్పుడూ లేని వింతలు చూస్తున్నామంటున్న టీచర్లు

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో బదిలీలలపై ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధ్యాయ బదిలీ చట్టాన్ని ఆ ప్రభుత్వమే అభాసుపాలు చేస్తోంది. గత నెలలో ప్రారంభమైన బదిలీలు అడుగడుగునా వివాదాస్పదంగా మారుతున్నాయి. చట్టంలో ఉన్న అంశాలను పక్కనబెట్టి అవసరం లేకున్నా టీచర్లతో బలవంతంగా అన్ని వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాల్సిందేనంటూ అధికారులు వేధిస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి వారం వారం ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశాలు నిర్వహించి, వారినుంచి అభ్యంతరాలను స్వీకరించినా చట్టంలో వాటికి చోటు కల్పించలేదు.

బదిలీలకు ఉత్తర్వులు రాగానే అందులోని అంశాలపై సంఘాల ప్రతినిధులు ఆందోళన చేయడంతో కొన్ని ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పి ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని చల్లబరిచి.. తర్వాత ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలను పట్టించుకోలేదు. పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ పేరుతో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలోకి తమకు అర్హత లేకున్నా బలవంతంగా బదిలీ చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్టేషన్‌ పాయింట్ల అంశంలోనూ అన్యాయం జరుగుతోందని, వీటిపై కోర్టులకు వెళితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1998 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు కౌన్సెలింగ్‌ విధానంలో జరుగుతున్నా అత్యంత వివాదాస్పదమైన బదిలీలు ఇవేనని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఒత్తిడి చేసి మరీ వెబ్‌ ఆప్షన్లు
స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతుల ద్వారా గ్రేడ్‌–2 హెడ్‌ మాస్టర్లుగా బదిలీ చేసేందుకు గతనెల 29న వెబ్‌ ఆప్షన్స్‌కు అధికారులు షెడ్యూల్‌ ఇచ్చారు. ఉదయం ప్రారంభం కావాల్సిన ప్రక్రియ అర్ధరాత్రి దాటినా కొలిక్కి రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పోస్టును భర్తీ చేసేముందు సీనియారిటీ, అర్హతలు పరిశీలించాలి. అనంతరం అభ్యంతరాలను పరిష్కరించి ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ స్కూల్‌ అసిస్టెంట్లకు ఎలాంటి దిశానిర్దేశం లేకుండా మే 31 ఒక్క రోజు గడువునిచ్చి ఆప్షన్లు పెట్టాల్సిందిగా ఒత్తిడి చేశారు. దీనిపై తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు రావడంతో మరో రోజు పొడిగించారు. ఫిర్యాదులు పరిష్కరించకుండా.. ఫైనల్‌ సీనియారిటీ జాబితా ప్రకటించకుండా వెబ్‌ ఆప్షన్స్‌ ఇవ్వాలని ఒత్తిడి చేయడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 

అర్హత లేకున్నా ఆప్షన్‌ ఇవ్వాల్సిందే!
ప్రస్తుత బదిలీల్లో సర్‌ప్లస్, లాంగ్‌ స్టాండింగ్‌తో పాటు స్వచ్ఛంద బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ సర్‌ప్లస్‌ కాని, లాంగ్‌ స్టాండింగ్‌ కాని, కనీసం బదిలీకి దరఖాస్తు చేసుకోని ఉపాధ్యాయులను సైతం వెబ్‌ ఆప్షన్స్‌ ఇవ్వాల్సిందేనంటూ డీఈవోలు తీవ్ర ఒత్తిడి చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. క్యాడర్‌ జూనియర్లంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1,477 మంది స్కూల్‌ అసిస్టెంట్లను కచ్చితంగా పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులకు ఆప్షన్‌ ఇవ్వాలంటూ శనివారం రాత్రి అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలు జాబితాలు విడుదల చేయడంపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. 

సబ్జెక్టు నిపుణులు పర్యవేక్షణకే పరిమితం
కూటమి ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ఇప్పటివరకు హైసూ్కళ్లల్లో సబ్జెక్టు నిపుణులుగా ఉన్న 4,706 మంది స్కూల్‌ అసిస్టెంట్లను ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంలుగా పర్యవేక్షణకే పరిమితం కానున్నారు. ఉత్తర్వుల్లో స్కూల్‌ అసిస్టెంట్లకు సబ్జెక్టు టీచర్లు, పీఎస్‌ హెచ్‌ఎంగా నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం కల్పించారు. కానీ దీనికి భిన్నంగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో పీఎస్‌ హెచ్‌ఎం ఖాళీలకు మాత్రమే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేలా విద్యాశాఖ మార్పు చేసింది. దీంతో బోధనపై ఇష్టం ఉన్న సబ్జెక్టు టీచర్లు పీఎస్‌ హెచ్‌ఎంలుగా వెళ్లక తప్పని పరిస్థితి తలెత్తింది. ్డ

బదిలీల్లో ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులివీ
బదిలీల్లో సర్‌ప్లస్‌ గాని.. లాంగ్‌స్టాండింగ్‌ గాని.. కనీసం బదిలీకి దరఖాస్తు చేసుకోని టీచర్లను సైతం వెబ్‌ అప్షన్లు ఇవ్వాలని డీఈవోలు ఒత్తిడి చేస్తున్నారు.
పాఠశాల యూనిట్‌గా సర్వీస్‌ను బట్టి సీనియర్, జూనియర్‌ కేడర్‌ నిర్ణయించాలి. కానీ జిల్లాని యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో చివరిసారిగా కేడర్‌లోకి వచ్చిన వారిని జూనియర్లుగా నిర్ధారించారు.
సర్‌ప్లస్‌ పోస్టులను సీఎస్‌ హెచ్‌ఎంలుగా సర్దుబాటు చేయాలి. ఇవేమీ చేయకుండా బదిలీ ప్రక్రియ నడుస్తోంది. దీనివల్ల ఎస్జీటీల పదోన్నతులకు గండి పడుతుంది.

సీనియర్లను జూనియర్లుగా మార్చేసి..
పాత జీవోలు, ప్రస్తుత జీవో–22 ప్రకారం పాఠశాల యూనిట్‌గా సర్వీస్‌ను బట్టి సీనియర్‌/జూనియర్‌ కేడర్‌ నిర్ణయిస్తారు. కానీ.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జిల్లాని యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో చివరిసారిగా ఆ కేడర్‌లోకి వచ్చిన వారిని జూనియర్లుగా నిర్ధారించారు. ఇలా పాఠశాలలోని సీనియర్లను జిల్లా యూనిట్‌గా తీసుకుని జూనియర్లుగా మార్చేశారు. తొలుత ఉపాధ్యాయుల సర్‌ప్లస్‌ను 1:53 టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ప్రకటించింది, అనంతరం ఆ సంఖ్యను 1:49 నిష్పత్తికి కుదించింది. ఈ మేరకు సవరించి ఉత్తర్వులు విడుదల చేయడంతో పాటు సర్‌ప్లస్‌ పోస్టులను పీఎస్‌ హెచ్‌ఎంలుగా సర్దుబాటు చేయాలి. కానీ.. ఇవేమీ చేయకుండానే బదిలీ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీంతో ఎస్జీటీల పదోన్నతులకు గండి పడుతుందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement