4న విశాఖకు రాష్ట్రపతి రాక 

President Draupadi Murmu Visit to Visakhapatnam On 4th December - Sakshi

నేవీ డే ఉత్సవాల్లో పాల్గొననున్న ద్రౌపదీ ముర్ము 

7 ప్రాజెక్టుల్ని వర్చువల్‌గా ప్రారంభించనున్న రాష్ట్రపతి 

సాక్షి, విశాఖపట్నం: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదిముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా విశాఖపట్నంలో పర్యటించనున్నారు. భారత నౌకాదళ దినోత్సవాల్లో నేవీ డే విన్యాసాల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో ఏడు కీలక ప్రాజెక్టుల్ని కూడా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్‌ను రాష్ట్రపతిభవన్‌ సెక్రటేరియట్‌ విడుదల చేసింది.

రాష్ట్రపతి డిసెంబర్‌ 4వ తేదీ మధ్యాహ్నం 2.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.25 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి 3.25 గంటలకు నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. 3.35 గంటలకు డేగా నుంచి బయలుదేరి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని చోళ సూట్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు.

సాయంత్రం 4.05 గంటలకు చోళా సూట్‌ నుంచి బయలుదేరి ఆర్‌కేబీచ్‌కి చేరుకుంటారు. నేవీ డే సందర్భంగా భారత నౌకాదళం నిర్వహించే యుద్ధ విన్యాసాల్ని ఆమె ప్రారంభించి తిలకిస్తారు. విన్యాసాలు ముగిసిన అనంతరం అదే వేదిక నుంచి కేంద్రప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.

సాయంత్రం 6.10కి తూర్పు నౌకాదళానికి చెందిన అనంతగిరి కేంద్రానికి చేరుకుని నేవీ డే రిసెప్షన్‌కు హాజరవుతారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటలకు బయలుదేరి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని 8 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరతారు. రాత్రి 8.40 గంటలకు రాష్ట్రపతి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.  

విశాఖలో రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించే ప్రాజెక్టులు ఇవే.. 
► రక్షణ శాఖకు సంబంధించి కర్నూలులో నిర్మించిన నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ (ఎన్‌వోఏఆర్‌), నిమ్మలూరులో నిర్మించిన అడ్వాన్స్‌డ్‌ నైట్‌విజన్‌ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ  
► కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఎన్‌హెచ్‌–340లో రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన హైవే, ఎన్‌హెచ్‌–205లో నిర్మించిన నాలుగు లైన్ల ఆర్‌వోబీ  
► ఎన్‌హెచ్‌–44లో కర్నూలు టౌన్‌లోని ఐటీసీ జంక్షన్‌లో ఆరులైన్ల గ్రేడ్‌ సెపరేటెడ్‌ స్ట్రక్చర్, స్లిప్‌రోడ్స్, డోన్‌ నగర శివారులోని కంబాలపాడు జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్‌ రోడ్లు, రహదారులు 
► గిరిజన శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్మించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్, సైన్స్‌ సెంటర్‌. 

శంకుస్థాపన చేసే ప్రాజెక్టు.. 
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌–342లో ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులు    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top