సహజ మరణాలపై రాజకీయం

Politics on natural deaths - Sakshi

ఆ మరణాలను కలిపి బురదజల్లే ప్రయత్నం

కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి గుంపులుగా చేరిన విపక్ష నేతలు

సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో రోజువారీ సహజ మరణాలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. రెండురోజులుగా సహజంగా మరణించినవారు కూడా.. సోమవారం రాత్రి ఘటన కారణంగానే చనిపోయారంటూ విపక్షాలు ఆందోళన చేయటంపై రోగుల బంధువులు, వైద్యసిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ప్రభుత్వ రుయా ఆస్పత్రిలో సోమవారం రాత్రి చెన్నై నుంచి ఆక్సిజన్‌ ఆలస్యంగా రావటంతో ఐదు నిమిషాల వ్యవధిలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్‌ పునరుద్ధరించిన అనంతరం, మంగళవారం సహజంగా మరణించిన వారిని కూడా సోమవారం రాత్రి జరిగిన సంఘటనలో మరణాలేనని టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులు కొందరు రాద్ధాంతం చేశారు.

కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభణ మొదలైనప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో రోజూ 2 వేలకుపైనే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య అంతకుమించి ఉంటోంది. కరోనా బాధితులతో పాటు వివిధ అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారిలో రోజూ కొందరు మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రులకు వచ్చిన ప్రతి కరోనా బాధితుడిని కాపాడేందుకు జిల్లా అధికారయంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు. పాజిటివ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 9 ప్రభుత్వ కోవిడ్‌ ఆస్పత్రుల్లో 2,798 బెడ్లు, 36 ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,210 బెడ్లు, 7 కోవిడ్‌ కేంద్రాల్లో 3,974 బెడ్లు ఉన్నాయి. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెడ్లు కేటాయిస్తున్నారు. తేలికపాటి లక్షణాలున్న వారు హోం ఐసొలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 

విపక్షాల నిరసన.. రుయాలో ఆక్సిజన్‌ అందక 11 మంది మృతిచెందిన ఘటనపై ;్చజీ రాజకీయ పార్టీలు మంగళవారం నిరసనకు దిగాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తమ అనుచరులతో రుయా వద్ద నిరసన తెలిపారు. గుంపులుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు కూడా ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. కోవిడ్‌ నిబంధనలను పాటించకుండా వ్యవహరించడం, విధుల్లో ఉన్న సిబ్బందికి ఆటంకం కలిగించడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు. 

తప్పుగా చెప్పాల్సిన అవసరం లేదు
రుయాలో రోజూ పదుల సంఖ్యలో సహజ మరణాలు ఉంటాయి. మృతుల సంఖ్యను తప్పుగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్యసిబ్బంది వైఫల్యం ఎక్కడా లేదు. రోజూ రెండు ట్యాంకర్ల ఆక్సిజన్‌ అవసరం ఉంది. నిన్న సాయంత్రం 5 గంటలకు రావలసిన ట్యాంకర్‌ రాత్రి 8 గంటల సమయంలో వచ్చింది. ఎందుకు ఆలస్యం అయిందంటే రకరకాల కారణాలు చెబుతున్నారు. ఆలోపే బల్క్‌ సిలిండర్లతో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశాం. ఆ సమయంలో 70 వెంటిలేటర్లు రన్‌ అవుతున్నాయి. దీంతో సమస్య తలెత్తింది.
– భారతి, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top