
కానిస్టేబుల్ తీరుపై కలెక్టరేట్ ఎదుట వివాహిత ధర్నా
ఒంగోలు టౌన్: భర్త మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతూ తనను పట్టించుకోవడం లేదని న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి..
ఒంగోలు నగరం కమ్మపాలేనికి చెందిన జి.హర్ష వర్థిని జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన నవీన్‌తో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
అయితే అక్కడి కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట హర్షవర్థిని తన పిల్లలతో సహా బైఠాయించింది. టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుతోపాటు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా మొండికేయడంతో కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్‌ను కలిసి సమస్య తెలియజేయాలని సీఐ సూచించగా.. అక్కడకు వెళ్లినా పోలీసుల దగ్గరకే పంపిస్తారని, తనకు న్యాయం జరగదని పేర్కొనడం గమనార్హం. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ చాలా సేపు బతిమాలడంతో ఎట్టకేలకు ఆమె ఆందోళన విరమించింది.