పోలవరం నిర్వాసితులు.. ఆ కాలనీలు అద్భుతం

Polavaram Project Displaced Hoses At Jangareddygudem Taduvai - Sakshi

జిల్లాలోనే అతిపెద్ద కాలనీగా రూపాంతరం

పోలవరం నిర్వాసితులకు సకల సౌకర్యాలతో నిర్మాణం

530 ఎకరాల్లో 6048 ఇళ్లు లక్ష్యం

3905 ఇళ్లు చేపట్టగా ఇప్పటికే 1024 పూర్తి

కాలనీ పూర్తయితే మెగా మున్సిపాలిటీగా మారనున్న తాడువాయి 

1047 ఎకరాల భూమి సేకరణ.. 532 ఎకరాల్లో 6048 ఇళ్ల నిర్మాణం.. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఆడిటోరియం వరకు సకల సౌకర్యాలు.. పంచాయతీ శివారు కాలనీ నుంచి మెగా మున్సిపాలిటీ దిశగా అడుగులు. ఇదీ జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పరిస్థితి. 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భూమిని సేకరించి అనేక గ్రామాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నిర్వాసితులతో పాటు పోలవరంలోని పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాలకు చెందిన గిరిజనేతరులకు జంగారెడ్డిగూడెం సమీపంలోని తాడువాయిలో అతి పెద్ద పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ప్రభుత్వం మొక్కుబడిగా నిర్మించి చేతులు దులుపుకోకుండా సకల సౌకర్యాలతో వందల కోట్ల వ్యయంతో కాలనీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే 7500 జనాభాతో ఉన్న తాడువాయి గ్రామం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పూర్తిస్థాయిలో సిద్ధమైతే ఒకేసారి 32 వేల పైచిలుకు జనాభాతో మున్సిపాలిటీగా మారనుంది.  

కలెక్టర్‌ నుంచి స్థానిక అధికారుల వరకు పర్యవేక్షణ 
తాడువాయిలో 6048 ఇళ్ల నిర్మాణం కోసం 1047 ఎకరాల భూమి సేకరించారు. ఇళ్లు, మౌలిక సదుపాయాల కోసం 530 ఎకరాలు కేటాయించారు. రూ.435.05 కోట్ల వ్యయంతో 3905 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇవిగాక 938 మంది నిర్వాసితులు ప్లాట్లు తీసుకుని వారే స్వయంగా నిర్మించుకుంటున్నారు. మరో 1205 ప్లాట్లను సిద్ధం చేసి ఉంచారు. 3905 ఇళ్ల నిర్మాణాలకు గాను 1024 ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నాయి. ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన క్రమంలో ప్రతి వారం సమీక్షలు నిర్వహించడంతో పాటు జిల్లా కలెక్టర్‌ మొదలుకొని స్థానిక అధికారుల వరకు పనులు పర్యవేక్షిస్తున్నారు. గత నెలలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ తాడువాయి కాలనీల్లో పర్యటించి నిర్మాణ పురోగతి,  అక్కడి స్థితిగతులపై లబ్ధిదారులతో మాట్లాడారు. దీంతో పనుల్లో వేగం పెరిగింది.

నిర్వాసితుల గృహం

 ఊరి నిర్మాణం ఇలా..
► తాడువాయి మేజర్‌ పంచాయతీ కాగా, దీనికి శివారు గ్రామాలుగా మంగిశెట్టిగూడెం, చల్లవారి గూడెం, గొల్లగూడెం, జొన్నవారిగూడెం ఉన్నాయి.  
►తాడువాయిలో మిగిలిన 517 ఎకరాలను యువతకు ఉద్యోగ కల్పన, మార్కెటింగ్, అవసరమైన కర్మాగారాల ఏర్పాటుకు, సామాజిక అవసరాలకు వినియోగించనున్నారు.
► ఇళ్ల నిర్మాణంతో పాటు గుడి, మసీదు, చర్చి, అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాలు, పంచాయతీ కార్యాలయం, షాపింగ్‌ కాంప్లెక్స్, పాఠశాలలు, బ్యాంక్, రైతుబజార్, ఏఎన్‌ఎం సబ్‌సెంటర్, పశు ప్రాథమిక వైద్యశాల, గోడౌన్లు, మినీ కోల్డ్‌ స్టోరేజీ, వాటర్‌ ట్యాంక్, బస్‌ షెల్టర్, ఇండోర్‌ స్టేడియం, డంపింగ్‌ యార్డు, పోస్టాఫీసు, పీహెచ్‌సీ, 3 శ్మశానవాటికలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, రెండు పార్కులు నిర్మిస్తున్నారు.  
►ఇవిగాక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో లబ్ధిదారులు కొందరు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్, అనువుగా ఉండే కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో దానిపై కార్యాచరణ ప్రారంభమైంది.  
► తాడువాయి ప్రస్తుత జనాభా 7500 కాగా, నిర్వాసితులంతా వారి గృహాల్లోకి చేరుకుంటే అదనంగా 24,500 మంది పెరగనున్నారు. దీంతో మొత్తం జనాభా 32 వేలకు చేరుకోనున్నట్టు అంచనా. 
► దీంతో మండలంలోనే అతి పెద్ద పంచాయతీగా తాడువాయి రూపుదిద్దుకోనుంది. భవిష్యత్తులో ప్రభుత్వ నిబంధనల మేరకు మున్సిపాలిటీగా రూపాంతరం చెందనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top