ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది: ప్రధాని మోదీ | PM Narendra Modi Comments In Yogandhra Abhiyan at Visakha | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది: ప్రధాని మోదీ

Jun 22 2025 5:00 AM | Updated on Jun 22 2025 5:00 AM

PM Narendra Modi Comments In Yogandhra Abhiyan at Visakha

విశాఖపట్నంలో జరిగిన ‘యోగాంధ్ర అభియాన్‌’లో ఆసనాలు వేస్తున్న ప్రధాని మోదీ

జీవన విధానంలో యోగా ఓ అంతర్భాగం

అంతరిక్షంలోనూ యోగా చేయడం ఎంతో సంతోషానిచ్చింది 

ఆయుర్వేద వైద్యం, యోగాభ్యాసనానికి ఈ–ఆయుష్‌ వీసా సౌకర్యం 

‘యోగాంధ్ర అభియాన్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ 

సెప్టెంబర్‌లో యోగా లీగ్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది. నేను అనే భావన నుంచి మనం అనే భావనను యోగా పెంపొందిస్తుంది’అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విశాఖలోని ఆర్‌కే బీచ్‌ వద్ద అంతర్జాతీయ యోగా డే వేడుకల సందర్భంగా నిర్వహించిన ‘యోగాంధ్ర అభియాన్‌’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. 

ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి 45 నిమిషాలపాటు యోగాసనాలు వేసి.. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘భారతీయుల జీవన విధానంలో యోగా అంతర్భాగం. 

దివ్యాంగులు బ్రెయిలీ లిపి ద్వారా యోగ సూత్రాలు చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా చేయడం, యోగా ఒలింపియాడ్‌లో గ్రామీణ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి’ అని పేర్కొన్నారు. 

ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించాలని తాను చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇస్తాయని ప్రధాని గుర్తు చేశారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ స్థాయిలో ప్రపంచ దేశాలు మద్దతు ఇచ్చాయని అభిప్రాయపడ్డారు. 

ప్రపంచంలో ఎక్కడైనా.. సిడ్నీ ఒపెరా హౌస్‌ మెట్లపై, ఎవరెస్ట్‌ శిఖరంపై, గగనతలంపై ఎక్కడైనా ‘యోగా అందరికీ’అనే నినాదమే వినిపిస్తుందన్నారు. యోగాను వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టడంతో పాటు కామన్‌ యోగా ప్రొటోకాల్‌ను తయారు చేస్తున్నామన్నారు. 

వంటల్లో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించాలని సూచించారు. ప్రపంచాన్ని స్థూలకాయం అనే సమస్య వేధిస్తోందని, యోగా చేయడంతో పాటు వంట నూనెల వాడకాన్ని తగ్గించడం ద్వారా స్థూలకాయ సమస్యను పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.  

చికిత్సలకు యోగా దోహదం 
గుండె, నరాలకు సంబంధించిన వ్యాధుల చికిత్సతో పాటు మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో యోగా ఎంతో దోహదపడుతుందని ఢిల్లీలోని ఎయిమ్స్‌ పరిశోధనలో తేలిందని ప్రధాని మోదీ చెప్పారు. భారతదేశంలోని ఆయుర్వేద వైద్యాన్ని, యోగా, యునాని వంటి ప్రాచీన వైద్య పద్ధతులను పొందేందుకు ప్రపంచ ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ–ఆయుష్‌ వీసా కల్పిస్తామన్నారు. విశాఖ నగరం ప్రకృతికి, ప్రగతికి నిలయమైన నగరమని కొనియాడారు. ఈ సందర్భంగా యోగా స్మారక పోస్టల్‌ స్టాంపును ప్రధాని విడుదల చేశారు.  

విశాఖ బీచ్‌ రోడ్‌లో యోగా ఆసనాలు వేస్తున్న ప్రజలు 

సెప్టెంబర్‌లో యోగా లీగ్‌ 
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో యోగా లీగ్‌ ప్రారంభిస్తున్నామని చెప్పారు. 2036లో జరిగే ఒలింపిక్స్‌తో పాటు కామన్‌వెల్త్‌ క్రీడల్లోనూ యోగాను చేర్చేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీని కోరారు. రాష్ట్రంలో మొత్తం 1.44 లక్షల మందికి యోగాలో శిక్షణ ఇచ్చామని చెప్పారు. 

ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు నెలకొల్పారన్నారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా ‘విజన్‌ స్వర్ణ ఆంధ్ర–2047’ప్రణాళికను అనుసరించి హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 

కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జయదేవ్‌ మాట్లాడుతూ యోగాంధ్ర అభియాన్‌లో ఏకంగా 10 లక్షల మంది పాల్గొంటున్నారని పేర్కొన్నారు. యోగా విశిష్టతను రుగ్వేదంలో మహానుభావులు తెలియజేస్తే... ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికులు ప్రధాని మోదీ అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కొనియాడారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.  
గిన్నిస్‌బుక్‌ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని చూపిస్తున్న ప్రధాని మోదీ,గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు 

రెండు గిన్నిస్‌ రికార్డ్స్‌
విశాఖలోని ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ 26 కిలోమీటర్ల మేర జరిగిన ఈ కార్యక్రమంలో 3.03 లక్షల మంది పాల్గొనడంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు లభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో సూరత్‌ వేదికగా 2023లో జరిగిన కార్యక్రమంలో 1.47 లక్షల మంది పాల్గొన్న కార్యక్రమం పేరిట ఇప్పటివరకు గిన్నిస్‌ రికార్డు ఉందని తెలిపాయి. 

మరోవైపు ఆంధ్రా యూనివర్సిటీలో ఈ నెల 20న (శుక్రవారం) 22,122 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి కూడా గిన్నిస్‌ రికార్డు లభించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆర్‌కే బీచ్‌ వద్ద లంగరేసిన 11 నౌకల్లో కూడా తూర్పు నావికాదళ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, శ్రీనివాసవర్మ పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement