
రాష్ట్రంలో 40శాతం ఓట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు
ఓట్లు ఎక్కువ వచ్చినవాళ్లకు తక్కువ సీట్లు.. తక్కువ ఓట్లు వచ్చినవారికి ఎక్కువ సీట్లు ఎలా వస్తున్నాయి?
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో 40శాతం ఓట్లు వచ్చిన రాజకీయ పార్టీకి 11సీట్లు వచ్చాయి. అదే దేశంలో 36శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి ఏకంగా 240సీట్లు వచ్చాయి. ఇదేమీ లెక్క? అసలు మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం(ఎంబీవీకే)లో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యాన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎన్నికల సంస్కరణలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీపీఎం చేసిన సూచనలకు సంబంధించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ మొత్తం మౌలిక అంశాలపై ఎన్నికల సంస్కరణలు జరగాలన్నది మా డిమాండ్. ఇప్పుడున్న విధానంలో తక్కువ ఓట్లతో ఎక్కువ సీట్లు పొందుతున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చినా తక్కువ సీట్లు వస్తున్నాయి. ఈవీఎంల, వీవీ ప్యాట్ నిర్వహణపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఆధారంగా నడిచే వీవీ ప్యాట్‌లను బయట నుంచి నియంత్రించే అవకాశం ఉంది. ప్రింట్ అయిన స్లిప్‌లకు, ఈవీఎంలో పోలైన ఓట్లకు సరిపోవాలి. కానీ, మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ తేడాలు వచ్చాయి’ అని చెప్పారు.