రెండు రోజుల్లో 58.67 లక్షల మందికి పింఛన్లు

Pensions for above 58 lakh people in two days - Sakshi

మొత్తం రూ.1,404.24 కోట్లు అందజేత

ఇప్పటివరకు 95.56 శాతం పూర్తి

నేడు కూడా కొనసాగనున్న పింఛన్ల పంపిణీ 

సాక్షి, అమరావతి/సంగం/బిట్రగుంట: అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ రెండో రోజు కూడా కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ సొమ్మును అందించారు. మార్చికి సంబంధించి రెండో రోజు మంగళవారం నాటికి 58,67,623 మందికి రూ.1,404.24 కోట్లు అందజేశారు. ఇప్పటివరకు 95.56 శాతం మేర పంపిణీ చేశామని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. బుధవారం కూడా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ అందిస్తారని చెప్పారు.

హైదరాబాద్‌కు వెళ్లి మరీ పింఛన్‌ అందజేత
ఓ వలంటీర్‌ తన పరిధిలోని లబ్ధిదారుకు పింఛన్‌ అందించడానికి ఏకంగా మరో రాష్ట్రానికి ప్రయాణించాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్ధీపురం క్లస్టర్‌లో పరుచూరు కృష్ణవేణమ్మ అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్ద ఉంటోంది. ఇప్పటికే రెండు నెలలుగా పింఛన్‌ తీసుకోలేకపోయింది. మార్చి 1 వచ్చినా రాకపోవడంతో ఆమె పింఛన్‌ ఆటోమేటిక్‌గా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో వలంటీర్‌ రమేష్‌ సోమవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లి మరీ మూడు నెలల పింఛన్‌ రూ.6,750 ఆమెకు అందించి వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. 

500 కిలోమీటర్లు ప్రయాణించి మరీ..
ఓ వలంటీర్‌ సొంత ఖర్చులతో తన ద్విచక్ర వాహనంపై పోను.. రాను 500 కిలోమీటర్లు ప్రయాణించి మరీ పింఛన్‌ సొమ్ము అందించాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు పంచాయతీ చెంచులక్ష్మీపురం గ్రామానికి చెందిన లంక అయ్యమ్మది నిరుపేద కుటుంబం. భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. గుండె సంబంధిత సమస్యతో పది రోజుల నుంచి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నెల ఒకటిన పింఛన్‌ పంపిణీ సమయంలో అయ్యమ్మ అందుబాటులో లేని విషయం తెలుసుకున్న వలంటీర్‌ వై.శ్రీకాంత్‌ చెన్నైకి వెళ్లి పింఛన్‌ అందజేయాలని నిర్ణయించుకున్నాడు. రైళ్లు కూడా సమయానికి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం తన ద్విచక్రవాహనంపై చెన్నై వెళ్లి ఆమెకు పింఛన్‌ అందజేసి శభాష్‌ అనిపించుకున్నాడు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top