
గ్రూప్–1, 2తో పాటు పలు పరీక్షలపై కోర్టులో వివాదాలు
ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు వెల్లడి
ఈనెల 7న అటవీశాఖలో ఉద్యోగాలకు పరీక్షలు
1,37,526 మంది అభ్యర్థులకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: గ్రూప్–1, 2తో పాటు డీవైఈఓ, లెక్చరర్ పోస్టులపై హైకోర్టులో కేసులు ఉన్నందున.. వాటిపై తీర్పు వచ్చాకే ఈ పోటీ పరీక్షల ఫలితాలు వెల్లడిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు వెల్లడించారు. విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ వంతుగా మొత్తం ప్రకియ్రను పూర్తిచేశామని, కోర్టు తీర్పు రాగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫలితాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కోర్టులో వివాదాలు నడుస్తుండడంవల్లే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షలు, డిప్యూటీ ఈఓ, ఎఫ్‌ఆర్వో పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతున్నాయని ఆయన చెప్పారు.
గ్రూప్–1కు సంబంధించి స్పోర్ట్స్ కోటా విషయంలో, గ్రూప్–2 విషయంలో రిజర్వేషన్ అంశంపై కేసు ఉన్నందున ఫలితాల వెల్లడిపై హైకోర్టు స్టే ఇచి్చందన్నారు. ఇది ఇప్పటివరకు జరిగిన డీవైఈఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల ఫలితాలకూ వర్తిస్తుందన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) ఫలితాలపైనా హైకోర్టు స్టే ఉందన్నారు. దీంతోపాటు మహిళా రిజర్వేషన్ (హారిజాంటల్)కు సంబంధించి వివాదం కూడా కోర్టులో నడుస్తోందని రాజాబాబు తెలిపారు. ఇదిలా ఉంటే.. గత నోటిఫికేషన్లలో భర్తీచేయగా మిగిలిపోయిన (క్యారీ ఫార్వర్డ్) 78 ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామన్నారు.
ఓఆర్‌ఎంలో చిన్న పొరపాటు చేసినా నష్టమే..
ఇక 691 ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకు 1,17,958 మంది దరఖాస్తు చేసుకున్నారని.. 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 19,568 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కార్యదర్శి రాజాబాబు తెలిపారు. వీరికి ఈనెల 7న 13 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామని.. అభ్యర్థులు తప్పుల్లేకుండా ఓఎంఆర్ షీట్ పూర్తిచేయాలని సూచించారు. అభ్యర్థులు బాల్‌పెన్‌తో మాత్రమే నింపి, బబ్లింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు తప్పులు చేస్తే ఓఎంఆర్ షీట్ ఇన్వాలిడ్ అవుతుందని.. దిద్దినా, కొట్టివేసినా, గోళ్లతో చెరిపినా, వైట్‌నర్ పెట్టినా ట్యాంపరింగ్ అయినట్లుగా ఏపీపీఎస్సీ భావిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ పరీక్షల్లో 1/3 నెగెటివ్ మార్కులు ఉన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలన్నారు.