Pawan Kalyan High Drama: సినిమాను మించిన పవన్‌ ‘పవర్‌’ డ్రామా 

Pawan Kalyan High Drama At Janasena Party Office Mangalagiri - Sakshi

తెలంగాణ పర్యటన ముగించుకుని హడావుడిగా మంగళగిరికి రాక 

గాలివల్ల ట్రిప్‌ అయి ఐదు నిమిషాలు కరెంట్‌ పోతే ‘అంధకారంలో ఆంధ్రప్రదేశ్‌’ అంటూ విమర్శలు

సాక్షి, అమరావతి: తెలంగాణలో తన పర్యటనను ముగించుకుని అకస్మాత్తుగా మంగళగిరికి వచ్చి కరెంట్‌ కోతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరి సమీపంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో 5 నిమిషాలపాటు ట్రిప్‌ అయి కరెంట్‌పోతే ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగానే ఉందని.. పవన్‌ ‘పవర్‌’ డ్రామా సినిమాను మించిందని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేశారు. 

ఫొటోలు తీయండి..
జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద జనరేటర్‌ ఉన్నప్పటికీ కరెంట్‌ అంతరాయం వచ్చినప్పుడు ఓ 5 నిమిషాలపాటు దానిని ఆన్‌ చేయకుండా ఉంచారు. సరిగ్గా ఆ సమయానికి  ప్రత్యేకంగా పిలిపించుకున్న కొద్దిమంది విలేకరులకు అదంతా చూపించి ‘ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలో ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?’.. అంటూ పవన్‌ తన డ్రామాను రక్తికట్టించారు. అదే సమయంలో పవన్‌కల్యాణే ‘ఫొటోలు తీయండి’ అంటూ పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు.

ఇదంతా పూర్తయ్యాక జనరేటర్‌ను ఆన్‌ చేయించారు. ఆ తర్వాత కరెంట్‌ వచ్చినప్పటికీ 20 నిమిషాల పాటు కావాలనే జనరేటర్‌ నడిపించారు. వాస్తవానికి పవర్‌కట్‌ అయితే 5 నిమిషాలకే తిరిగి కరెంట్‌ సరఫరా మొదలవదు. కానీ, జనసేన కార్యాలయానికి కరెంట్‌ను సరఫరా చేసే తెనాలి రోడ్డులోని మంగళగిరి 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌లో ఈదురుగాలులకు రాత్రి 8.30–8.35 మధ్య 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడినట్లు సబ్‌స్టేషన్‌ రికార్డుల్లో నమోదైంది. అంటే సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడినట్లు తెలిసిపోతోంది.

తెలంగాణ పర్యటనకు వచ్చిన పవన్‌ అది ముగించుకుని హడావుడిగా మంగళగిరికి బయల్దేరి మధ్యలో కొంతమంది మీడియా ప్రతినిధులకు మాత్రమే సా. 5.30కు ఫోన్లుచేసి ‘పవన్‌కల్యాణ్‌ మీతో ప్రత్యేకంగా మాట్లాడతారు.. 6.30 కల్లా పార్టీ కార్యాలయానికి రావాలి’.. అంటూ సమాచారమిచ్చారు. కానీ, శుక్రవారం ఎంపిక చేసుకున్న విలేకరులకు ఫోన్లుచేసి పిలిపించుకున్నారు.

పవర్‌ కట్‌ కాదు.. ఫీడర్‌ ట్రిప్‌ అయ్యింది
విద్యుత్‌ అంతరాయంపై పవన్‌ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, కోత అనేది అసలు లేనే లేదని ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) సీఎండీ జే పద్మజనార్దనరెడ్డి స్పష్టంచేశారు. ఓవర్‌ లోడ్‌తో ఫీడర్‌ ట్రిప్‌ అయ్యిందని, షిఫ్ట్‌ ఆపరేటర్‌ వెంటనే గుర్తించి ఐదు నిమిషాల్లో సరిచేశారని.. 20 నిమిషాలు పట్టిందనడం అవాస్తవమన్నారు. ఇదే అంశంపై ఏపీసీపీడీసీఎల్‌ మంగళగిరి ఏడీఈ ఏ సత్యనారాయణ కూడా స్పందిస్తూ.. జనసేన కార్యాలయం ఉన్న ప్రాంతంలో ఎటువంటి విద్యుత్‌ కోతలు విధించలేదన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top