
సాక్షి, కృష్ణా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. ఈ సందర్భంగా పవన్.. ఫ్యాన్స్ రెచ్చిపోయారు. మచిలీపట్నంలోని రేవతి ధియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి థియేటర్ వద్ద రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వారిని కట్టడి చేయలేక పోలీసులు.. లాఠీలకు పని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియెలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మచిలీపట్నంలోని రేవతి ధియేటర్‌లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షోకి పరిమితికి మించి అభిమానులు థియేటర్‌కు వచ్చారు. దీంతో, పోలీసులు.. వారిని కట్టడి చేయలేకపోయారు. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తోసుకుంటూ థియేటర్‌లోకి చొచ్చుకొచ్చారు. దీంతో, థియేటర్ ఎంట్రన్స్ గేటు గ్లాస్ ధ్వంసమైంది. అంతటితో ఆగకుండా.. ఫ్యాన్స్ తోసుకుంటూ ఒకరిపై మరొకరు వాటర్ క్యాన్లతో దాడి చేసుకున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లాఠీలకు పని చెప్పడంతో పరిస్థితి కొంత సర్దుమణిగింది.
ఇక, కడప నగరంలోని రాజా థియేటర్ వద్ద కూడా పవన్ ఫాన్స్ హంగామా సృష్టించారు.. బైక్ సౌండ్స్‌తో రచ్చ రచ్చ చేశారు. బైకుల సైలెన్సర్లు తీసి నగరంలో బైక్ రైడింగ్‌తో హంగామా చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలుగా విడిపోయి ఫ్యాన్స్ కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు సర్దిచెప్పినా పవన్ ఫ్యాన్స్ వినిపించుకోలేదు. దీంతో, థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.

సంధ్య థియేటర్ వద్ద భారీ బందోబస్తు..
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. థియేటర్ ముందు హంగామా చేశారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి అనుమతిస్తున్నారు. థియేటర్ లోపల కూడా పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.