తాడేపల్లి : జీవీఎంసీ అధికారి గోవిందరావు మృతికి టీడీపీ నేత, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభే కారణమన్నారు వైఎస్సార్‌సీపీ ఉద్యోగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి. గోవిందరావుపై పట్టాభి జులుం ప్రదర్శించి మరణానికి కారణమయ్యారన్నారు. అధికారి చావుకు కారణమైన పట్టాభిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈరోజు(శుక్రవారం, జనవరి 23వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి..గోవిందరావు మృతిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ పట్టాభిని వెంటనే పదవి నుండి తొలగించాలి. గోవిందరావు చెప్పే మాటలు కూడా వినకుండా పట్టాభిరామ్ జులుం ప్రదర్శించారు. చంద్రబాబు తన తొత్తులను అధికారుల మీదకు ఉసి గొల్పారు.
జన్మభూమి కార్యక్రమం పేరుతో అప్పట్లో చంద్రబాబు కూడా ఇలాగే ఉద్యోగుల ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఆయన శిష్యులు ఆ పని చేస్తున్నారు. పెద్ద అధికారులకే దిక్కు లేకపోతే ఇక చిరుద్యోగుల పరిస్థితి ఏంటి?, ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకుంటామన్న చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?, రూల్స్ ప్రకారం అడిగితే అధికారులు, ఉద్యోగులు సమాధానం చెప్తారు. అంతేగానీ అందరి ముందూ అవమానిస్తే ఊరుకోం. ఇంకా ఎంతమంది ఉద్యోగులను బలి తీసుకుంటారు?, చంద్రబాబు గోవిందరావు మృతికి బాధ్యత వహించాలి. చంద్రబాబుకు ఉద్యోగులపై ప్రేమ ఉంటే వెంటనే పట్టాభిని పదవి నుండి తొలగించాలి. పూర్తి స్థాయి విచారణ జరపాలి. గతంలో అటవీ శాఖ అధికారులపై దాడి చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందుకే కూటమి నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పట్టాభిరామ్.. ఉద్యోగులతో పెట్టుకోవద్దు. రాష్ట్రం మీద పడి ఉద్యోగులను చంపే అధికారం మీకు ఎవరిచ్చారు?,
ఇప్పటికే ఉద్యోగులకు రావాల్సిన ఏ బకాయినీ చెల్లించకుండా వేధిస్తున్నారు. ఇప్పుడేమీ ఏకంగా ఉద్యోగులను చంపుకుంటూ పోతారా?’ అని మండిపడ్డారు.


