పాలకొండ రూరల్: ఏటిరో.. పిల్లాజల్లా అంతా కలిసి బెజివాడలో ఉంటున్నారట.. పండగకు ఇదేనా రావడం అంటూ శ్రీనివాసరావును సంఘంశాల ఎదుట కూర్చున్న ఊరిపెద్దలు పలుకరించారు. కొండపై అమ్మవారి దయతో అక్కడ బతుకుతున్నాం. పండగ కోసం ఊరు వచ్చేందుకు నరకం చూశాం. శ్రీకాకుళం నుంచి పాలకొండ చేరడం అటుంచితే ఆటోలో నవగాం మీదుగా ఊరి వచ్చేసరికి సరదా తీరిపోయింది. రోడ్డు మధ్యలో గోతులు ఏంటిరా దద్ది.... పడితే పెద్దల్లో కలసిపోతాం. గత పండగకు వచ్చినప్పుడు రోడ్డు వేస్తామన్నారు.. నిజమే అనుకున్నాను. చూస్తే రోడ్డు వేయలేదు. మరీ దారుణంగా ఉన్నాయంటూ వాపోయాడు.
సురేష్: శ్రీనుతో కలిసి ఆటోలో వచ్చిన సురేష్ మాట అందుకున్నాడు... ఇక్కడే రేషన్ బండి నడిపేవాడిని. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రేషన్‌బండిని నిలిపివేసింది. ఉపాధికోసం తెలంగాణా వెళ్లాను. ఇప్పుడు జనమంతా రేషన్ కోసం కొండలు దిగి దుకాణాలకు పరుగుతీయాల్సిన పరిస్థితి.
భీమన్న: ప్రయాణికుడైన భీమన్న అంతలో కలుగచేసుకుని ఈ ఏడాది పంటలు సరిగ్గా పండించ లేకపోయాను. విత్తనాలు లేవు. అన్నదాత సుఖీభవ పథకం పూర్తిగా అందలేదు. పెట్టుబడికి అప్పుచేశాను. సాగు నీరు లేక పంట ఎండిపోయింది. వర్షాలకు ఒరిగిపోయింది. బస్తాడు యూరియా కోసం పాలకొండే కాదు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాను. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఈ దుస్థితి ఏ రైతుకూ కలగలేదు. అందుబాటులోనే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు లభించేవి. ఇప్పుడు రైతుభరోసా కేంద్రం ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు అంతా డాబుడూబులే..
చిన్నయ్య: మరో వృద్ధుడైన చిన్నయ్య మాటకలుపుతూ కరెంట్ బిల్లు ముట్టుకుంటే షాక్‌తగులుతోంది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఊరికి రావడంలేదు. వైద్యసేవలు గతంలో వలే అందడంలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేస్తున్నారని తెలిసింది. ఇది ఎంతఘోరం. ఇలాగైతే మనలాంటి పేదలు ఏమైపోవాలి. రైతులు పంటలు కోల్పోతే పరిహారం కూడా అందడంలేదు. ఏ పథకమూ సరిగా అందిన దాఖలా లేవు. ఏం చెప్పుకుంటామయ్యా.. ప్రభుత్వం మారింది.. పరపతి పోయింది అంటూ నిట్టూర్చారు.
అమ్మకు ఉద్యోగం పోయింది..
నాన్న చనిపోయాక ఊరిలో పనులుకు చేసుకునేవాడిని. ఇప్పుడు విజయవాడలో కూలి పనులు చేస్తున్నా. అక్కడ వచ్చే సొమ్ము భార్యా, పిల్లలకు కడుపు నింపేందుకే చాలదు. అమ్మ ఊరి బడిలో ఆయాగా చేసేది. గత ప్రభుత్వంలో బడిలో స్వీపర్‌గా చేరింది. మేం ఎక్కడ ఉన్నా అమ్మకు ఎదో చిన్నపని ఉంది అని భరోసాతో ఉండేవాడిని. ఇటీవల స్వీపర్ ఉద్యోగం తొలగించారు. అమ్మను కూడా ఇకపై నేనే చూసుకోవాలి. ఇంటిళ్లపాది కష్టపడితేనే బతుకు. ఏం చేస్తాం... మధ్యతరగతి కుటుంబాలు మావి.
– టి.శ్రీను, ఎం.సింగుపురం, పాలకొండ మండలం


