ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. ఏపీ సర్కార్‌ కీలక ప్రెస్‌మీట్‌

Orissa Rail Accident: Botsa Satyanarayana Review Meeting With Officers - Sakshi

సాక్షి,విశాఖ: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మల్లికార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృతంలో సమీక్ష సమావేశం జరిగిందని.. ట్రైన్ ప్రమాదంలో క్షతగాత్రులను మృతులను తీసుకురావాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఒరిస్సా పంపించారన్నారు.

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామన్నారు.వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు 5 గురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నట్లు తెలిపారు. వీరందరి ఫోన్‌ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్‌ చేస్తున్నామన్నారు. ప్రయాణికుల్లో 267 మంది సురక్షితంగా ఉండగా.. 20 మందికి స్వల్పంగా గాయాలు కాగా, 82 మంది ప్రయాణాలను రద్దుచేసుకున్నట్టు వెల్లడైనట్లు తెలిపారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అయినట్లు భావిస్తున్నామని.. ప్రస్తుతం ఈ 113 మంది వివరాలను సేకరించడానికి ముమ్మరంగా చర్యలుచేపడుతున్నామన్నారు. 
(చదవండి: 'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో చెదిరిన మధ్యతరగతి కుటుంబాలెన్నో..)

ఇదిలా ఉండగా హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. వారిలో విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని, స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారని చెప్పారు. 10 మంది ట్రైను ఎక్కలేదని, 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అయినట్లు తెలిపారు.

సీఎం ఆదేశాలు మేరకు ఇచ్చాపురం నుంచి బోర్డర్‌లో ఉన్న అన్ని హాస్పిటల్స్ ను సిద్ధం చేశామన్నారు.అన్ని కలెక్టరేట్లోను హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రం నుంచి మెడికల్ టీమ్స్ తో పాటు మొత్తంగా 65 అంబులెన్స కు పంపించినట్లు చెప్పారు. వీటితో పాటు విమానాశ్రయంలో ఒక చాపర్‌ను కూడా సిద్ధంగా ఉంచామని, అవసరమైతే నేవి సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏపీ నుంచి ఎవరు చనిపోయినట్లు సమాచారం లేదని గాయపడినట్లు మాత్రమే మాకు సమాచారం అందిందన్నారు. ఒరిస్సాలో కూడా మన వారికి వైద్యం అందించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు.
(చదవండి: ఎంత కష్టం వచ్చింది!.. చివరి సారిగా బస్సుకు ముద్దుపెట్టి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top