వస్త్రాల్లో ఆర్గానిక్‌ ట్రెండ్‌

Organic trend in clothing - Sakshi

రసాయనాలు వాడని దుస్తులకు క్రేజ్‌ 

కెమికల్స్‌ లేకుండా పండించిన పత్తి నుంచి నూలు 

చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి రంగులు 

చేనేతకు అదనపు హంగులద్దుతున్న నేతన్నలు 

పర్యావరణానికీ ఎంతో మేలు 

సాక్షి, అమరావతి: ఆర్గానిక్‌ అనగానే వంటలకు సంబంధించిన వస్తువులే గుర్తుకువస్తాయి. కానీ దుస్తుల్లోనూ ఇప్పుడు ఆర్గానిక్‌ ట్రెండ్‌ వచ్చేసింది. ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా సాగు చేసిన పత్తిని సేకరించి.. దానినుంచి నూలు ఒడుకుతున్నారు. ఆ నూలుకు సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను అద్ది ఆర్గానిక్‌ వస్త్రాలను నేస్తున్నారు. చేనేత వస్త్రాల్లో ఇప్పుడిదే కొత్త ట్రెండ్‌. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట తదితర ప్రాంతాల్లో నేతన్నలు ఆర్గానిక్‌ వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లోనూ ఆర్గానిక్‌ వస్త్రాల ఉత్పత్తికి ఊతమిచ్చేలా ఆప్కో చర్యలు చేపడుతోంది. 

రంగులు అద్దుతారిలా... 
► చెట్ల బెరడు, పూలు, పండ్లు, కాయలు, ఆకులను సేకరించి.. నీటిలో ఉడికించి సహజసిద్ధ రంగుల్ని తయారు చేస్తున్నారు.  
► ఆయా రంగుల్లో ముంచి ఆరబెట్టిన ఆర్గానిక్‌ నూలు(యార్న్‌)తో మగ్గంపై కలర్‌ ఫుల్‌ బట్టలను నేస్తున్నారు.  
► దానిమ్మ కాయ బెరడుతో పసుపు, ముదురు ఆకుపచ్చ రంగులు, కరక్కాయ, జాజి, అల్జీరిన్‌తో ఎరుపు, కరక్కాయ, కరక పువ్వుతో బంగారు పసుపు (గోల్డెన్‌ ఎల్లో), మోదుగ పూలతో ముదురు పసుపు రంగుల్ని తయారు చేస్తున్నారు. చామంతి పువ్వులతో లేత పసుపు రంగు (లెమన్‌ ఎల్లో), ఇండిగో ఆకుల నుంచి నీలం రంగు, ఉల్లి పైపొరతో లేత గులాబీ, పాలకూర ఆకుల నుంచి లేత ఆకుపచ్చ, నల్ల బెల్లం, నీరు, కాల్చిన ఇనుము కలిపిన మిశ్రమం నుంచి నలుపు రంగుల్ని తీస్తున్నారు.  
► వీటిని తుమ్మ జిగురుతో కలిపి బట్టలకు రంగులు బాగా పట్టేలా చేస్తున్నారు. ఈ వస్త్రాల తయారీకి ఖర్చు ఎక్కువే అయినా.. క్రేజ్‌ పెరుగుతోంది. 

ప్రయోజనాలివీ.. 
► ఆర్గానిక్‌ వస్త్రాల వినియోగంతో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది.  
► ఆర్గానిక్‌ వస్త్రాల్లో రసాయనాలు లేవు కాబట్టి చర్మ సంబంధ వ్యాధులు, రసాయనాలు పీలిస్తే వచ్చే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top