
హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తున్న కుప్పం డిపో ఆర్టీసీ బస్సులో తనిఖీ చేయగా.. రెండు లగేజీ బ్యాగుల్లో రూ.కోటీ 90 లక్షలు బయటపడ్డాయి
సాక్షి, కర్నూలు: ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) సీఐ లక్ష్మీదుర్గయ్య ఆధ్వర్యంలో శనివారం రాత్రి కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తున్న కుప్పం డిపో ఆర్టీసీ బస్సులో తనిఖీ చేయగా.. రెండు లగేజీ బ్యాగుల్లో రూ.కోటీ 90 లక్షలు బయటపడ్డాయి. అనంతపురానికి చెందిన కమీషన్ ఏజెంట్ కోనేరి రామచౌదరి ఈ డబ్బును తీసుకెళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలూ చూపకపోవడంతో నగదును సీజ్ చేసి కర్నూలు తాలూకా పోలీసులకు అప్పగించారు. కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ ఆదివారం మీడియాకు ఈ నగదు వివరాలు వెల్లడించారు. పట్టుబడిన డబ్బు గుంతకల్లు పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగనాయకుడునాయుడుకు చెందినదని, హైదరాబాద్‌లో స్థలం కొనుగోలుకు తీసుకెళ్లి.. బేరం కుదరకపోవడంతో వెనక్కి తీసుకొస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించామని, ఆధారాలు చూపి తీసుకెళ్లొచ్చని చెప్పారు.