పర్యావరణ నేస్తాలు.. సముద్ర తాబేళ్లు.. | Olive Ridleys Protect The Environment In Vizianagaram | Sakshi
Sakshi News home page

పర్యావరణ నేస్తాలు.. సముద్ర తాబేళ్లు..

Jul 11 2021 8:32 AM | Updated on Jul 11 2021 8:33 AM

Olive Ridleys Protect The Environment In Vizianagaram - Sakshi

సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది. నీటిని శుద్ధి చేస్తాయి. ఆక్సిజన్‌ స్థాయిని పెంచుతాయి. మత్స్య సంపద వృద్ధికి తోడ్పడతాయి. తీర ప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండటంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వేళ అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టారు. పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు. 1,22,658 తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. తాబేళ్లు మానవాళికి, చేపల వృద్ధికి కలిగించే ప్రయోజనాలపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్‌.   

సాక్షి, విజయనగరం: జిల్లా తీర ప్రాంతం సుమారు 28 కిలోమీటరు. భోగాపురం, పూసపాటి రేగ మండలాల్లో విస్తరించి ఉన్న తీరం తాబేళ్ల పునరుత్పత్తికి ఆలవాలం. అందుకే ఏటా పెద్ద ఎత్తున ఇక్కడి తీరానికి సముద్ర తాబేళ్లు చేరుకుంటాయి. గుడ్లు పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. వీటి సంరక్షణకు 2014 సంవత్సరంలో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం వారు తీరంలో 10 ఆలివ్‌రిడ్లి తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు.  

పెంపకం ఎలా
ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని తల్లి తాబేళ్లు తీరం అంచుకు చేరుకుని గుడ్లు పెడతాయి. వీటిని నక్కలు, అడవి పందులు ధ్వంసం చేయకుండా అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్లు పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో అధికారులు ముందుగా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో మిని హేచరీలు ఏర్పాటుచేసి అందులో రెండు నుంచి మూడు అడుగులు సైజు గుంతలు తవ్వి గుడ్లును ఉంచుతారు. గుంతల్లో పొదిగిన గుడ్లు నుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 రోజుల నుంచి 60 రోజుల సమ యం పడుతుంది. డిసెంబర్‌–జూన్‌ వరకు ఈ ఉత్పత్తికేంద్రాల ద్వారా తాబేళ్లు అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో ట్రీ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది.  

చంపినా, తిన్నా నేరమే..  
తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. మూడు సంవత్సరాల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు. భారత ప్రభుత్వం ఈ తాబేళ్ల చట్టం పరిధిలో షెడ్యూల్‌–1 లో చేర్చింది.

మానవాళికి తాబేళ్లు చేసే మేలు ఇలా...   
తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీరప్రాంతాల్లో నివసించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు. సముద్రంలో ఆక్సిజన్‌ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్‌ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్‌ బెడ్‌ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్‌పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తిని చేస్తాయి. దీంతో మత్స్య సంపద వృద్ధిచెందుతుంది.  

ప్రత్యేకతలు...   
ఆలివ్‌రిడ్లి తాబేలు సుమారు 45 కిలోల బరువు, మూడు అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్లు పొడవు, అరంగులం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150 గుడ్లు వరకు గుడ్లు పెడుతుంది. మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రతీరంలోకి వెళతాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెట్టడం వీటి ప్రత్యేకత. తాబేలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవిస్తాయి.  

Advertisement
 
Advertisement
Advertisement