రాష్ట్రంలో ఏభై శాతం పచ్చదనమే లక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సందేశం.. ఇవి వినడానికి ఎంత బాగున్నాయి.. నిజంగానే వీరిద్దరూ అదే లక్ష్యంతో పనిచేస్తుంటే అభినందించవచ్చు. కానీ జరుగుతున్నదేమిటి?. ఏపీలో ఈ మధ్య కాలంలో జరిగినంత పర్యావరణ విధ్వంసం మరెన్నడూ జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు.
ఒకవైపు విశాఖలో కొండలను పిండి చేసేస్తున్నారు. ఇంకో వైపు డేటా సెంటర్ల పేరుతో విపరీతమైన కాలుష్యానికి కారకులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాలలోని పచ్చటి భూములను ఎండబెట్టారు. కృష్ణానది తీరంలోనే నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం అయిన భవనాలలోనే ముఖ్యమంత్రి, కీలక మంత్రి నివసిస్తారు. అయినా పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం గొప్పగా ఉపన్యాసాలు ఇస్తుంటారు. తద్వారా ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ఒకటికి పదిసార్లు రుజువు చేసుకుంటున్నారని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అమరావతిలో కానీ, ఇప్పుడు విశాఖలో కాని ఎండలు తగ్గించాలని అధికారులను ఆదేశిస్తే వేడి తగ్గిపోతుందా? ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ముఖ్యమంత్రి బ్యాటరీ సైకిల్ తొక్కి ఫొటోలకు పోజులు ఇస్తే పర్యావరణాన్ని కాపాడినట్లు అయిపోతుందా?.
అవసరమైన మేర భూమి తీసుకుని కావల్సిన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి, వేల ఎకరాల పచ్చటి పొలాలను సమీకరించి, వేల కోట్లను ఓ 30 గ్రామాల పరిధిలో వెచ్చిస్తే ఏపీ ప్రజలందరికీ ఎలా ఉపయోగం జరుగుతుందో తెలియదు. అమరావతి గ్రామాలలో భూమి స్వభావం భారీ భవంతుల నిర్మాణానికి అనువుకాదని పలువురు నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు అనుసరించవలసిన పలు షరతులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించినా వాటిని గాలికి వదలివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందులో అమరావతిలో జరుగుతున్న పర్యావరణ వినాశనం గురించి పవన్ గట్టిగా మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్నది తప్పు అని స్పష్టంగా చెప్పారు. అవసరమైతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని కూడా ఆయన ఆనాడు హెచ్చరించారు.
2024 నాటికి ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. వెంటనే ఆయన వైఖరి కూడా మారిపోయింది. ఇప్పుడు అమరావతిలో పర్యావరణ విధ్వంసాన్ని సమర్థిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు కృష్ణా తీరం వెంబడి ఉన్న కరకట్ట ఇంటిలో ఉండడాన్ని కూడా పవన్ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక ఆ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన లింగమనేని రమేష్‌ను జనసేన పక్షాన రాజ్యసభకు పంపారు. ఈయన చంద్రబాబును మించి అవకాశవాదం ప్రదర్శిస్తున్నట్లుగా అనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ రిషికొండపై అప్పటికే ఉన్న టూరిజం నిర్మాణాలను తొలగించి ప్రతిష్టాత్మకమైన రీతిలో కొత్త భవనాలను నిర్మిస్తే అది పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని, కొండకు గుండు కొడతారా అంటూ దుర్మార్గంగా చంద్రబాబు, పవన్ విమర్శించేవారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అయితే శరభ, శరభ అంటూ పూనకం వచ్చినట్లు వార్తలు ఇచ్చేది.
ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించారు. గూగుల్ అదానీ డేటా సెంటర్ పేరుతో వందల ఎకరాల కొండలను ఇచ్చేశారు. వాటిని ఆ సంస్థలు తవ్విపారేస్తున్నా కిక్కురునడం లేదు. ఇప్పుడు సింహాచలం కొండలకు గుండు కొట్టినా అది సుందరమేనని వీరు భావిస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాలు డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల కలిగే కాలుష్యం, నీటి సమస్య, కరెంటు సమస్య వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని వ్యతిరేకిస్తున్నాయి. దానితో ఆ బహుళజాతి సంస్థలు అభివృద్ది చెందని, అభివృద్ది చెందుతున్న భారత్ వంటి దేశాలపై దృష్టి పెట్టాయని అమెరికాకు చెందిన ఒక మీడియా ఓ కథనాన్ని ఇచ్చింది. డేటా సెంటర్లు రావడం వల్ల ఏపీకి ప్రయోజనం అయితే స్వాగతించవచ్చు. కానీ వాటివల్ల ఎక్కువగా పర్యావరణ అనర్థం జరుగుతుంటే, దానికి ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే విశాఖకు తీరని నష్టం జరుగుతుందన్న భావన ఉంది. దానిపై ప్రజలలో కూడా అలజడి ఏర్పడుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు డేటా సెంటర్ల వల్ల వచ్చే సమస్యలను ఆలోచించకుండా, కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడితే ఏపీకి ముఖ్యంగా విశాఖకు ఏం ప్రయోజనం కలుగుతుంది?. పైగా ఆ కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ దీనిపై అభ్యంతరం చెబుతూ ఇప్పటికే చంద్రబాబుకు లేఖ రాశారు. రిలయన్స్ సంస్థ ప్రతిపాదిస్తున్న డేటా సెంటర్‌కు ఏభై వేల కోట్లు రాయితీలు ఇస్తున్నారని, అయినా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడగడం లేదని ఆయన అన్నారు. వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయో, రావో తెలియని గూగుల్ డేటా సెంటర్‌కు 22వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. మరో పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య విశాఖ కొండలను తొలిచివేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కొండపై జగన్ నిర్మాణం చేస్తే విధ్వంసం, కూటమి ప్రభుత్వం చేస్తే అభివృద్ది అవుతుందా? అని ప్రశ్నించారు.
ఇక సముద్ర తీరంలో నిర్మాణాల నిమిత్తం సీఆర్‌జడ్ నిబంధనల మార్పునకు సూచనలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడంపై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు విశాఖ బీచ్‌లో మద్యం పాకలను అనుమతించడంపై కూడా జనం మండిపడుతున్నారు. అమరారాజా బ్యాటరీస్ సంస్థ నుంచి వెలువడే కాలుష్యాన్ని సరిచేసుకోవాలని జగన్ ప్రభుత్వం నోటీసు ఇస్తే, పరిశ్రమను తరిమేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఘనత టీడీపీది, ఎల్లో మీడియాదే. ఇప్పుడేమో కాలుష్యంపై మరో రకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక విశిష్టత ఉంది. ఆయన సందర్భాన్ని బట్టి అభిప్రాయాలను మార్చేసుకుంటారు. కొద్ది కాలం క్రితం సమీక్షలో అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇతర శాఖల ప్రతిపాదనలకు గాను అడవులలో చెట్టు నరకడానికి, నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన కోప్పడ్డారు. పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం ఏభై శాతం పచ్చదనమే లక్ష్యమని గంభీర ప్రకటనలు చేశారు.
ఏపీలో కాలుష్య సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది ఈ మద్య పవన్ రాజమండ్రి సందర్శన సందర్భంగా మరోసారి బయటపడింది. పేపర్ మిల్లు వ్యర్ధ జలాలపై తనకు ఎదురైన సమస్యను మంత్రి దుర్గేష్ వివరించగా, ఆయనపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఆ పరిశ్రమ వారు తనతో మాట్లాడాలని అన్నారట. రాబోయే గోదావరి పుష్కరాలలో కెమికల్ స్నానాలు చేస్తారా అని కూడా పవన్ సీరియస్‌గా ప్రశ్నించారు. దీనిని బట్టే గోదావరిలో ఏ మేరకు కాలుష్యం ఉందో అర్దం చేసుకోవచ్చు. ఏడాదిలోగా దీని నివారణకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారన్నదానిపై ఆయనే సందేహం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరిలో నదీ కాలుష్యం తీరుతెన్నులను కూడా ప్రస్తావించారు. చిత్తశుద్దితో ఆయన కాలుష్య నివారణకు ప్రయత్నిస్తే మంచిదే. కానీ, ఏదో సినిమాటిక్‌గా డైలాగులు చెప్పి ఊరుకుంటే ఉపయోగం ఉండదు. గ్రామాలలో చెత్త లేకుండా చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినా, పరిస్థితి పెద్దగా మారినట్లు కనబడదు. ఏది ఏమైనా పర్యావరణ పరిరక్షణను ఒక నినాదంగా మార్చేసి తాము చేయవలసిన విధ్వంసం యథావిధిగా కొనసాగిస్తే ఏపీకి తీరని నష్టం చేసినవారు అవుతారేమోనన్న విషయాన్ని కూటమి పాలకులు ఆలోచించుకోవాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


