పర్యావరణం
ఎల్‌నినో అనేది స్పానిష్ మాట. అర్థం ‘చిన్న పిల్లవాడు’
పిల్లలూ... ఇటీవల పేపర్లలో, టీవీల్లో ‘ఎల్‌నినో’ అనే మాట వినిపిస్తూ ఉంది. ‘ఎల్‌నినో’ ఉందని, జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎల్‌నినో అంటే ఏమిటి? అది ఎందుకు రాబోతూ ఉంది... ఆ సంగతులు మనకు తెలియాలి కదా.
ఎల్‌నినో అంటే?
ఎల్‌నినో అనేది స్పానిష్ మాట. అర్థం ‘చిన్న పిల్లవాడు’ అని. కాని ఈ చిన్న పిల్లవాడు తెచ్చేది రాక్షస కరువు. అందుకే ఎల్‌నినో అంటే కరువు రాక్షసుడు. 400 ఏళ్ల క్రితం పెరూ, ఈక్వడార్ దేశాల్లో సముద్రం ఒడ్డున ఉండే జాలర్లు ఒక విషయం గమనించారు. ఒక్కో సంవత్సరం డిసెంబర్ నెలలో, అంటే క్రిస్మస్ టైంకి, సముద్రం నీళ్లు ఒక్కసారిగా వేడెక్కిపోయేవి.అలా వేడెక్కితే చేపలు దొరకవు. సముద్రం ఒక చిన్నపిల్లవాడిలా చేసే ఈ అల్లరిని ముద్దుగా ‘ఎల్‌నినో’ అన్నారు. డిసెంబర్‌కు ముందు ఇలా జరుగుతుంది కాబట్టి డిసెంబర్‌లో జీసెస్ పుట్టినరోజు కాబట్టి ‘బేబీ జీసస్’ అని కూడా ముద్దుగా పిలిచారు. ప్రకృతి అల్లరి చేస్తే గట్టి తిట్లు తిట్టుకోలేము కదా. అందుకే ఇలా.

కారణం ఏమిటి?
పసిఫిక్ మహాసముద్రం ఉంది కదా. సౌత్ అమెరికా దగ్గర ఆ సముద్రం నీళ్లు కొన్నిసార్లు బాగా వేడెక్కిపోతాయి. ఒక డిగ్రీ, రెండు డిగ్రీలు ఎక్కువ వేడిగా అయిపోతాయి. సముద్రం వేడెక్కితే దాని పైన ఉన్న గాలి, మేఘాలు, వానలు అన్నీ గందరగోళం అవుతాయి. అది మన దేశం వరకు వచ్చి వాతావరణాన్ని మార్చేస్తుంది. సాధారణంగా పసిఫిక్ సముద్రం మీద తూర్పు నుంచి పడమరకి గాలులు వీస్తాయి. ఆ గాలులు వేడి నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు తోసేస్తాయి. దాంతో మన ఇండియా వైపు వాన మేఘాలు వస్తాయి. కానీ 2 నుంచి 7 ఏళ్లకి ఒకసారి ఆ గాలులు బలహీనం అయిపోతాయి. లేదా రివర్స్‌లో వీస్తాయి. అప్పుడు వేడి నీళ్లు తిరిగి సౌత్ అమెరికా వైపు, అంటే పెరూ, ఈక్వడార్ దగ్గర చేరిపోతాయి. వేడి నీళ్లు ఒకచోట కుప్పగా చేరితే సముద్రం వేడెక్కుతుంది. అదే ఎల్‌నినో మొదలు.
ఎల్‌నినో వస్తే ఏమవుతుంది?
మన ఇండియాలో వానలు తగ్గిపోతాయి. మనకి వానలు తెచ్చే రుతుపవనాలు బలహీనం అవుతాయి. కరువు వస్తుంది. బోర్లు ఎండిపోతాయి. చలికాలంలో కూడా ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది. 2026లో హీట్‌వేవ్స్ ఎక్కువయ్యి పంటలు దెబ్బతింటాయి: వరి, గోధుమ, కూరగాయలు పండవు. కూరల రేట్లు పెరిగిపోతాయి. సౌత్ అమెరికాలో మాత్రం వరదలు వస్తాయి. ఆస్ట్రేలియాలో అడవులు తగలబడతాయి. 2015–16లో చాలా పెద్ద ఎల్‌నినోలు వచ్చాయి. ఇప్పుడు 2024–2026 ఎల్‌నినో వచ్చింది. అందుకే ఈ రెండేళ్లు ఎండలు ఎక్కువ, వానలు తక్కువ.


