
సాక్షి, అమరావతి: ఏపీలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. మండలి సాక్షిగా పచ్చి నిజం వెల్లడైంది. 1 నుంచి ఇంటర్ వరకు 77,58,930 మాత్రమే విద్యార్థులు ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. 2023-24 UDISE డేటా ప్రకారం 87, 41, 885 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం లో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక UDISE డేటాతో పోలిస్తే 9,82,955 మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినట్లు తేలింది.
రాష్ట్ర ప్రభుత్వం డేటాతో పోలిస్తే సుమారు 6 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గిపోయారు. గత రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య ఘోరంగా తగ్గిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు తగ్గిపోయారు. సీఎంగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టాక విద్యార్థుల సంఖ్య తగ్గింది.
ఫీజుల భారం, విద్యా ప్రమాణాలు తగ్గిపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గింది. గత ఏడాది అమ్మ ఒడి పథకాన్ని ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యలోనూ భారీగా కోత విధించింది. మండలిలో మంత్రి లోకేష్ సమాధానంతో అసలు నిజం బట్టబయలైంది. ఏపీలో 77,58,930 మంది విద్యార్థుల్లో 66,57,508 మందికే వర్తింపు చేసిన ప్రభుత్వం.. 11,01,422 మంది విద్యార్థులు అనర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాది 2 లక్షల 70 వేల మందికి తల్లికి వందనం నిధులు ఇప్పటికి జమకాలేదు. కేంద్రం ఇచ్చిన నిధులపై మండలిలో మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేకపోయారు.
