ఎంబీబీఎస్, బీడీఎస్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

Notification For MBBS And BDS Admissions - Sakshi

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఈ నెల 21 వరకు గడువు 

తొలుత అఖిల భారత కోటా.. ఆ తర్వాత స్టేట్‌ కోటాలో సీట్ల భర్తీ 

ధ్రువపత్రాలన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి నీట్‌లో అర్హత సాధించినవారు ఈ నెల 21 సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కోర్సుల్లో కటాఫ్‌ స్కోర్, స్టేట్‌ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ముందు అఖిల భారత కోటాలో 15 శాతం సీట్లు, తర్వాత స్టేట్‌ కోటాలో ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లు, తదుపరి యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేస్తారు. 

మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 
శుక్రవారం (ఈ నెల 13) నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. జనరల్, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ విద్యార్థులకు 147, ఎస్సీ ఎస్టీ, బీసీలకు 113, దివ్యాంగులకు 129గా కటాఫ్‌ మార్కులను నిర్ణయించారు. దరఖాస్తుకు వెబ్‌సైట్‌.. http://ntruhs.ap.nic.in/

అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు..  
► స్థానికులై ఉండటంతోపాటు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం, దివ్యాంగులకు 45 శాతం) మార్కులు వచ్చి ఉండాలి. 
► అభ్యర్థికి 2020 డిసెంబర్‌ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. వైకల్యం ఉన్నవారు నిర్ధారిత సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. 

దరఖాస్తు ఫీజు 
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకునే జనరల్, బీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ.3,540 (జీఎస్టీతో కలిపి). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,950 (జీఎస్టీతో కలిపి). అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డెబిట్‌ కార్డ్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 

కావాల్సిన ధ్రువపత్రాలు 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాలన్నీ పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో కేబీల్లోనే ఉండాలి.  
► నీట్‌ ర్యాంకు కార్డు 
► ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌ మార్కుల మెమోలు 
► 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు 
► టీసీతోపాటు కులధ్రువీకరణ పత్రం,మైనార్టిలు, ఈడబ్ల్యూఎస్‌లకు సంబంధిత శాఖలు జారీ చేసిన ధ్రువపత్రాలు 
► ఆధార్‌ కార్డు, లోకల్‌ సర్టిఫికెట్‌ కార్డు, పాస్‌పోర్టు ఫొటో, సంతకం, నివాస ధ్రువీకరణ పత్రం వంటివన్నీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 

అభ్యర్థులు సంప్రదించాల్సిన నంబర్లు  
► సాంకేతిక సమస్యలకు: 9490332169, 9030732880, 9392685856 
► సలహాలు, సందేహాలకు: 08978780501, 7997710167 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top