హత్య చేసినా రిమాండ్‌ లేదు! | No remand even commit assassinated | Sakshi
Sakshi News home page

హత్య చేసినా రిమాండ్‌ లేదు!

Jul 10 2025 4:57 AM | Updated on Jul 10 2025 4:57 AM

No remand even commit assassinated

సోషల్‌ మీడియాలో పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి 41 ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకుని విడిచిపెట్టాలి..! ఇదీ చట్టం! కానీ.. సోషల్‌ మీడియా పోస్టులు పెట్టిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తూ ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి జైలు పాలు చేస్తున్నారు. హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నిస్తే.. చంద్రబాబు రెడ్‌బుక్‌ పాలనలో అంతే అంటున్నారు!! 

హత్యలకు పాల్పడే నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్‌కు తరలించాలి.. ఇదీ చట్టం...!  ఓ వ్యక్తిని కుట్రపూరితంగా హతమార్చి నేరాన్ని అంగీకరించిన నిందితులను మన రాష్ట్ర పోలీసులు 41 ఏ నోటీసు ఇచ్చి సాగనంపడం విస్మయం కలిగిస్తోంది. దేశ పోలీసు చరిత్రలో ఎక్కడాలేనిరీతిలో అన్నమయ్య జిల్లా పోలీసులు వ్యవహరించిన తీరు ఇదిగో ఇలా ఉంది..!! హత్య చేశారని వెల్లడించిందీ ఎస్పీనే... నిందితులను రిమాండ్‌కు పంపకుండా విడిచిపెట్టారు   - సాక్షి, అమరావతి

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గంగాధరను ఆయన భార్య వనితతో­పాటు కేవీ పల్లె మండలానికి చెందిన సోదంరెడ్డి రాము, మదనపల్లెకు చెందిన ఆటోడ్రైవర్‌ గంజి మహేశ్‌­బాబు కలసి మట్టుబెట్టారు. కుప్పం డిప్యూటీ డీఎంహెచ్‌వో గంగాదేవి వీరికి సహకరించారు. ఆమె ఇచ్చిన మత్తు మాత్రలను నీటిలో కలిపి తాగించడంతో మత్తులోకి జారు­కున్న గంగాధర్‌ను నిందితులు బండ రాళ్లతో మోది అంతమొందించారు. గంగాదేవి పరీక్షించి మరీ ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతో ఈ హత్యకు పాల్పడినట్లు అన్నమయ్య జిల్లా పోలీసుల దర్యాప్తులో తేలడంతో మొత్తం నలుగురిని పోలీ­సులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 

అనంతరం ఈ కేసులో వనిత, రెడ్డి రాము, గంజి మహేశ్‌ బాబులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు ప్రకటించారు. ముగ్గురు నిందితులను మాత్రమే మీడియా సమావేశంలో హాజరు పరిచారు. కుప్పం డిప్యూటీ డీఎంహెచ్‌వోను అరెస్టు చేసినట్లు చెప్పకపోవటంపై పోలీసు వర్గాల్లోనే తీవ్ర విస్మయం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఆమె డిప్యూటీ  డీఎంహెచ్‌వో కావడంతో ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

పోనీ.. అరెస్టు చేసినట్టు వెల్లడించిన ముగ్గురు నిందితులనైనా నిబంధనల ప్రకారం న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించాలి. ఏమైందో తెలియదు కానీ.. అరెస్టు చేసినట్లు ప్రకటించిన వనిత, రెడ్డి రాము, గంజి మహేశ్‌­బాబుకు పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడంతో ముగ్గురూ దర్జాగా బయటకు వచ్చేశారు. ఈ ఘాతుకానికి సహకరించిన కుప్పం డిప్యూటీ డీఎంహెచ్‌వో గంగాదేవిని అసలు అరెస్టు చేయకుండానే అంతకుముందే పోలీసులు విడిచిపెట్టారు. ఈ వ్యవహారం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. 

హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు పంపకుండా పోలీసులు ఎలా విడిచిపెట్టారన్నది మిస్టరీగా మారింది. దీనిపై మదనపల్లి పోలీసు అధికారులను సంప్రదించగా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు ఆదేశాల మేరకు వదిలేసినట్లు వెల్లడించారు. హతుడికి ఎంతటి తీవ్రమైన నేర చరిత్ర ఉన్నా నిందితులను నిబంధనల ప్రకారం న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తర లించాలి. న్యాయస్థానం తీర్పే అంతిమం. దీనికి విరుద్ధంగా అన్నమ య్య జిల్లా ఎస్పీ వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

సోషల్‌ మీడియా కార్యకర్తలపై జులుం.. 
మరోవైపు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తూ రిమాండ్‌కు తరలిస్తుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమ అరెస్టులపై ఇటీవల హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సోషల్‌ మీడియా పోస్టులు, మీడియా, కళాత్మక భావ వ్యక్తీకరణలపై నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు చేయవద్దని, రిమాండ్‌కు పంపవద్దని హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయించడం గమనార్హం. తాము యథేచ్ఛగా హక్కులను కాలరాస్తున్నా.. అణచివేస్తున్నా అడ్డు చెప్పకూడదనే రీతిలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది.

ఐఏఎస్‌ ‘పచ్చ’పాతం!
ఓ ప్రైవేట్‌ భవనం నీలి రంగు డిజైన్‌ను తొలగించాలని సీనియర్‌ ఐఏఎస్‌ హుకుం 
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయనో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. తమ జిల్లా టీడీపీలో క్రియాశీలంగా ఉన్న కుటుంబానికి చెందిన ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక స్థానంలో ఉన్నారు. తాడేపల్లిలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ఆ అపార్టుమెంట్‌ను ఆనుకునే ఓ ప్రైవేటు భవనం ఉంది. దాని యజమాని తన భవనానికి ఫ్రంట్‌ ఎలివేషన్‌ చేయించారు. అందులో తమ బిల్డింగ్‌కు ‘వీ స్వే్కర్‌’ అనే లోగోను అందంగా డిజైన్‌ చేయించి నీలిరంగు పెయింటింగ్‌ వేయించారు. అదే ఆ సీనియర్‌ ఐఏఎస్‌కు కంటగింపుగా మారింది. 

తాను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు పక్కన బిల్డింగ్‌పై నీలి రంగులో ‘వీ స్వే్కర్‌ ’ అనే పేరు కనిపించడం చూసి తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. నీలి రంగులో ఉన్న ఆ లోగోను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈమేరకు మున్సిపల్‌ అధికారుల ద్వారా ఆ బిల్డింగ్‌ యజమానికి హుకుం జారీ చేశారు. ఓ ప్రైవేటు వ్యక్తి తన సొంత భవనానికి తన అభిరుచికి తగ్గట్టుగా రూపొందించిన లోగోను, తనకు నచ్చిన రంగుల్లో డిజైన్‌ చేయించుకుంటే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాన్ని తొలగించాలని ఆదేశించడం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement