రీసర్వే విజయవంతం 

No Illegal Registrations With Pilot Programme Resurvey Of Lands - Sakshi

రామభద్రపురం: రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే పకడ్బందీగా చేయడంతో విజయవంతమైందని కమిషనర్‌ ఆఫ్‌ సర్వే అస్టిస్టెంట్‌ డైరెక్టర్‌ బీఎల్‌ కుమార్‌ అన్నారు. రామభద్రపురం మండలంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద గుర్తించి సర్వే పూర్తి చేసిన మర్రివలసతో పాటు ప్రస్తుతం   మిగిలిన గ్రామాలలో రీసర్వే జరుగుతున్న తీరును శుక్రవారం ఆయన పరిశీలించారు. రీసర్వే పూర్తయిన మర్రివలసలో సర్వే అధికారులు సర్వే రాళ్లు ఎలా పాతారో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు.  

2023 నాటికి రీ సర్వే పూర్తి చేసి ఎలాంటి చిక్కులు లేకుండా భూములను రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన సర్వే ప్రకారం భూములు అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం వంటి వాటికి చెక్‌పడుతుందన్నారు.  రీ సర్వేలో సర్వే అధికారులకు రైతులు సహకరించాలని సూచించారు. రామభద్రపురం మండలం సర్వే అధికారులు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని మండల సర్వేయర్‌ శ్రీనివాసరావు, గ్రామ సర్వేయర్లను అభినందించారు.

అనంతరం రీసర్వే ఎలా జరిగింది?  భూముల లెక్క తేలిందా? సర్వే అధికారులు పారదర్శకంగా సర్వే చేశారా? అని రైతు సూరెడ్డి చిన్నంనాయుడును అడిగి తెలుసుకున్నారు. దీనికి రైతు మాట్లాడుతూ గతంలో భూములు పాస్‌పుస్తకంలో నమోదు చేసుకునేందుకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారమని, ప్రభుత్వం రీ సర్వే చేపట్టి   భూములు ఎవరి వారికి నమోదయ్యేలా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ పరిశీలకులు బీబీవీవీ  రాజు, బొబ్బిలి డివిజన్‌ సర్వేయర్‌ రవి శంకర్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top