
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు మంగళవారమే పరిహారం అంటూ సీఎం ప్రకటన
పంటనష్టం నమోదుకు అసలు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయలేదు
క్షేత్ర స్థాయిలో సర్వే చేయలేదు.. జాబితాలే సిద్ధం కాలేదు..
ముఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలపై అన్నదాతల విస్మయం
కంకిపాడు: అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం నమోదు చేయలేదు. అసలు పంట నష్టం అంచనాలపై పూర్తి స్థాయిలో నివేదికలు రూపొందించలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ‘మంగళవారం సాయంత్రానికే పరిహారం’ అంటూ ప్రచారం చేయటంపై రైతన్నలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం గడిచిపోయింది పంట నష్టపరిహారం ఏదీ... అని ప్రశ్నిస్తున్నారు.
అకాల వర్షంతో అన్నదాతకు కష్టం
పంట చేతికొచ్చేన తరుణంలో ఇటీవల ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగా గాలి, వాన బీభత్సం సృష్టించింది. మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిచిపోయింది. మొక్కజొన్న కండెలు, గింజలు వర్షానికి తడిచి నానిపోయాయి. పొలాల్లో ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. పెనమలూరు నియోజకవర్గంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలాయి. అరటి, బొప్పాయి, తమలపాకు, మునగ పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో ప్రభుత్వం పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. కానీ మంగళవారం సాయంత్రం వరకు ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ముఖ్యంగా అధికారులు ప్రాథమిక అంచనాలను సేకరించుకుని తమ వద్ద భద్రపర్చుకున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా పంట నష్టం నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే, వ్యవసాయశాఖ మాత్రం కృష్ణా జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదని తేల్చేసింది. ఉద్యానశాఖ అధికారులు మాత్రం 127 మంది రైతులకు చెందిన 231 ఎకరాల్లో బొప్పాయి, అరటి, మునగ, కూరగాయలు, తమలపాకు పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలను నమోదు చేశారు. ఇందుకు గానూ రూ.1.04 కోట్లు పరిహారం అవసరమని అంచనాలను సిద్ధం చేశారు. అంతే తప్ప తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపలేదు. కానీ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించి మంగళవారం నాటికి పరిహారం అందించాలంటూ అధికారులను ఆదేశించడంతో రైతులు ఆశ్చర్యపోతున్నారు. అసలు పంట నష్టం తుది నివేదిక తయారు చేయకుండా ఎలా పరిహారం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.