విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమ‌తులు.. గర్వంగా ఉందన్న మంత్రి రజిని

NMC approvals for Vizianagaram Govt Medical College - Sakshi

ఏపీ వైద్య రంగంలో మ‌రో మైలురాయి

ఫ‌లిస్తున్న జ‌గ‌న‌న్న కృషి

విజ‌య‌న‌గ‌రంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌కు అనుమ‌తులు

150 సీట్ల‌కు అనుమ‌తి ఇస్తూ ఎన్ ఎంసీ ఉత్త‌ర్వులు

2023-24 విద్యా సంవ‌త్స‌రం నుంచే త‌ర‌గతులు ప్రారంభం

మ‌రో నాలుగు క‌ళాశాలల‌కూ త్వ‌ర‌లోనే అనుమ‌తులు వ‌చ్చేలా చ‌ర్య‌లు

మొత్తం ఐదు నూత‌న కళాశాలల్లో ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభించాల‌నేది జ‌గ‌న‌న్న ల‌క్ష్యం

రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప్రకటన

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య రంగాల్లో మ‌రో మైలురాయి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖమంత్రి విడ‌ద‌ల ర‌జిని పేర్కొన్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ ప్రారంభించేందుకు జాతీయ వైద్య మండలి(నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌) అనుమతులు లభించినట్లు మంగళవారం ఆమె వెల్లడించారు. 

‘‘ఈ నెల మూడో తేదీన ఎన్ఎంసీ బృందం.. విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాలకు సంబంధించి త‌నిఖీలు నిర్వ‌హించింది. ఆ టైంలో.. అక్క‌డి నిర్మాణాలు, బోధ‌నా, బోధనేత‌ర సిబ్బంది, వ‌స‌తులు, ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, లైబ్రరీ, హాస్ట‌ళ్లు, ఆస్ప‌త్రి, బోధ‌నా సిబ్బంది అనుభ‌వం, వారి పబ్లికేష‌న్లు, అందుబాటులో ఉన్న న‌ర్సింగ్‌, పారామెడిక‌ల్ సిబ్బంది.. ఇలా అన్నిఅంశాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించింది. ఏపీ ప్ర‌భుత్వం స‌మ‌కూర్చిన వ‌స‌తులు, సిబ్బంది నియామ‌కాలతో స‌హా అన్ని అంశాల‌పై సంతృప్తి చెంది..  ఈ ఏడాది నుంచే త‌ర‌గుతులు నిర్వ‌హించుకోవ‌డానికి అనుమ‌తులు మంజూరు చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఎన్‌ఎంసీ నుంచి ఉత్త‌ర్వులు ప్ర‌భుత్వానికి అందినట్లు ఆమె తెలిపారు. విజయనగరం మెడికల్‌ కళాశాలకు మొత్తం 150 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ అనుమ‌తులు మంజూరు చేసింద‌న్నారామె.

ఇక.. రాష్ట్రంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని మంత్రి రజిని పేర్కొన్నారు. అందులో భాగంగానే.. విజ‌య‌న‌గ‌రంలో ఈ ఏడాది నుంచి ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ను ప్రారంభించేందుకు అనుమతులు లభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.8,500 కోట్లతో.. మొత్తం 17 ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణాన్ని జ‌గ‌న‌న్న చేప‌ట్టార‌ని, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన విజ‌య‌న‌గ‌రం క‌ళాశాల‌కు తొలి అనుమ‌తులు రావ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ఆమె పేర్కొన్నారు.

మ‌రో నాలుగు క‌ళాశాల‌ల‌కు కూడా..
ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే రాష్ట్రంలో మ‌రో నాలుగు ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను కూడా ప్రారంభించాల‌నే దృఢ నిశ్చ‌యంతో ఏపీ ప్ర‌భుత్వం ముందుకు వెళుతోంద‌ని పేర్కొన్నారు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని. మ‌చిలీప‌ట్నం, ఏలూరు, విజ‌య‌న‌గ‌రం, నంద్యాల‌, రాజ‌మండ్రిల్లోనూ వైద్య క‌ళాశాల‌లు ప్రారంభ‌మ‌య్యేలా ఇప్ప‌టికే అన్ని వ‌స‌తులు స‌మ‌కూర్చుతున్నామ‌న్నారు. ఇందుకోసం అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ఆయా క‌ళాశాల‌ల‌కు అనుమ‌తులు మంజూర‌య్యేలా సిబ్బంది నియామకాలు ఇప్ప‌టికే పూర్తి చేశామ‌ని తెలిపారు.  నూత‌న క‌ళాశాల‌ల‌కు సంబంధించి లైబ్రరీల నిర్మాణం, కావాల్సిన ఫ‌ర్నిచ‌ర్‌, పుస్త‌కాలు, వైద్య ప‌రిక‌రాల కొనుగోలు... ఇలా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

అలాగే.. పీజీ సీట్ల‌ను రాష్ట్రంలో గ‌ణ‌నీయంగా పెంచుకునే విష‌యంలోనూ సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్ర‌భుత్వం విజ‌యం సాధించింద‌ని మంత్రి  తెలిపారు. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవ‌ని, ఇప్పుడు ఈ సీట్ల సంఖ్య ఏకంగా 1,249 కు పెంచుకోగ‌లిగామ‌ని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ప్ర‌వేశ‌పెట్టిన సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగానే ఇది సాధ్య‌మైంద‌ని వెల్ల‌డించారు. ఈ ఏడాది కూడా మ‌రో 637 సీట్ల పెంపుద‌ల‌కు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఆ ప్ర‌య‌త్నంలో ఇప్ప‌టివ‌ర‌కు 90 సీట్ల‌ను అద‌నంగా సాధించ‌గ‌లిగామ‌ని వివ‌రించారామె.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top