నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి.. నీతి ఆయోగ్‌ ప్రశంస

NITI Aayog Praises Sustainable Development with Navratnalu Scheme - Sakshi

అట్టడుగు స్థాయినుంచి ఎస్‌డీజీల అమలుకు ఏపీ చర్యలు భేష్‌ 

గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అమోఘం 

సంక్షేమ పథకాల అమలుతో పేదల సామాజిక, ఆర్థికాభివృద్ధి  

నాడు–నేడుతో విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన 

2019–20లో ఎస్‌డీజీల సాధనలో ఉన్నతస్థాయిలో ఏపీ  

సాక్షి, అమరావతి: నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ) సాధనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. అట్టడుగు స్థాయి నుంచి  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నవరత్నాలను ఏకీకరణ చేసి అమలు చేస్తోందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగా లక్ష్యాల సాధనపై స్వయంగా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారని నీతి ఆయోగ్‌ తెలిపింది.

వివిధ రాష్ట్రాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్థానికీకరణ చర్యలపై నీతి ఆయోగ్‌ అధ్యయన నివేదికను బుధవారం విడుదల చేసింది. నవరత్నాల ద్వారా పేదల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని నివేదికలో పేర్కొంది. నవరత్నాలతో మానవాభివృద్ధి సూచికలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా గుమ్మం వద్దే పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది.

గ్రామ, వార్డు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తున్నదని నివేదిక స్పష్టం చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై క్షేత్రస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాపులు నిర్వహించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో లక్ష్యాల సాధన పురోగతిపై రియల్‌టైమ్‌ పర్యవేక్షణకు ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు నివేదిక తెలిపింది.

11,162 గ్రామ, 3,842 వార్డు సచివాలయాలను 2019–20లోనే ఏర్పాటు చేయడంతో పాటు వలంటీర్ల వ్యవస్థ ద్వారా గుమ్మం దగ్గరే పౌర సేవలను అందిస్తున్నదని, సచివాలయాల ద్వారా 541 సేవలను అందిస్తుందని నివేదిక తెలిపింది. 28 విభాగాలకు చెందిన సేవలను ఒకే పోర్టల్‌ ద్వారా గ్రామ, వార్డు స్థాయిలో అందించడంతో పాటు ప్రజల ఫిర్యాదులను గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే పరిష్కరిస్తున్నట్లు నివేదిక తెలిపింది.  ఎస్‌డీజీల పురోగతిని ప్రణాళికా శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ శాఖలు, శాఖాధిపతులు, సచివాలయ, కలెక్టర్ల స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నవరత్నాల అమలు
నవరత్నాల ద్వారా ఎస్‌డీజీలను స్థానికీకరణ చేసి అమలు చేస్తున్నారని, ప్రధానంగా వ్యవసాయం, వైద్య, విద్య, పేదల గృహ నిర్మాణం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని నివేదిక  తెలిపింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ ఆసరా, చేయూత, వైఎస్సార్‌ జలయజ్ఞం, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ,, వైఎస్సార్‌ రైతు భరోసా, పేదలకు గృహాల నిర్మాణాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

ఎవరినీ వదిలిపెట్టకుండా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు వ్యూహాత్మకంగా నవరత్నాలను అమలు చేస్తోందని నివేదిక పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలను అమలు చేయడంతో పాటు ఎస్‌డీజీల సాధనకు అవసరమైన పథకాలకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించడం ద్వారా బలహీన వర్గాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర, జిల్లా, పంచాయతీ స్థాయిలో  395 కొలవదగిన సూచికలను గుర్తించి 16 ఎస్‌డీజీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నివేదిక తెలిపింది.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అన్ని స్థాయిల్లో కాలపరిమితిని నిర్ధారించడంతో పాటు అసెంబ్లీలోనూ చర్చించడం ద్వారా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఎస్‌డీజీల సాధనకు అవసరమైన సిబ్బందికి అన్ని స్థాయిల్లో సామర్థ్యం పెంచేందుకు అవసరమైన వర్క్‌షాపులను నిర్వహిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2019–20లో ఎస్‌డీజీల సాధనలో ఏపీ ఉన్నత స్థాయిలో ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఎస్‌డీజీల అమల్లో నీతి ఆయోగ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తోందని వివరించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top