విశేష అధికారాలంటూ వివాదాస్పద నిర్ణయం

Nimmagadda Rameshkumar made another controversial decision - Sakshi

ఎన్నికలకు ముందే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో ‘పంచాయితీ’

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రారంభం కాకుండానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు విశేషాధికారాలు ఉన్నాయంటూ చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్‌ ఎస్పీని విధుల నుంచి తప్పిస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వివాదస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురు అధికారులతో పాటు ఒక ఆడిషనల్‌ ఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తాను విధుల నుంచి తప్పిస్తున్నట్టు శుక్రవారం ప్రొసీడింగ్‌ ఉత్తర్వులను జారీ చేశారు. ఆర్టికల్‌ 324, అర్టికల్‌ 243(కె) ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉండే విశేష అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు.

గతేడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ అధికారులను తొలగించాలంటూ అప్పట్లోనే తాను ప్రభుత్వానికి సూచించానని, తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈనెల 8న ఒకసారి 21న మరోసారి దీనిపై సీఎస్‌కు గుర్తు చేసినట్లు ఉత్వర్వుల్లో ఎస్‌ఈసీ పేర్కొన్నారు. కాగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి సన్నాహాలు చేస్తూ ఒక్క రోజు ముందు ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ అధికారితో సహా మొత్తం 9 మంది అధికారులపై విశేషాధికారాల పేరుతో చర్యలు తీసుకోవడం పట్ల ఉద్యోగ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం లేకుండా కలెక్టర్లు, ఎస్పీని తనంతట తానుగా తప్పించే అధికారం ఎస్‌ఈసీకి ఉంటుందా? అని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

ముగ్గురి పేర్లను పంపాలన్న ఎస్‌ఈసీ
గుంటూరు జిల్లా కలెక్టరు జాయింట్‌ కలెక్టరు–1కు, చిత్తూరు జిల్లా కలెక్టరు జాయింట్‌ కలెక్టరు–1కు బాధ్యతలు అప్పగించాలని నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ తన బాధ్యతలను చిత్తూరు జిల్లా ఎస్పీకి అప్పగించాలని ఆదేశించారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు,  తిరుపతి అర్బన్‌ ఎస్పీగా కొత్త వారి నియామకానికి సంబంధించి ముగ్గురు అధికారుల పేర్లను తన పరిశీలనకు పంపాలని సీఎస్‌కు సూచించారు. మిగిలిన ఆరుగురు పోలీసు అధికారుల బాధ్యతలను కొత్త వారికి అప్పగించేందుకు డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శుక్రవారం ఉదయం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును వివరించి శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తెలియజేశారని కమిషన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిమ్మగడ్డకు గవర్నర్‌ సూచించినట్లు  తెలిసింది. పావుగంట పాటు ఇరువురి భేటీ కొనసాగింది. ఈ భేటీకి సంబంధించి గవర్నర్‌ కార్యాలయం కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top