రూ.1,045 కోట్లతో కొత్త రోడ్లు

New roads connecting towns with their nearby villages - Sakshi

పట్టణాలతో వాటి సమీపంలోని గ్రామాలను కలుపుతూ నిర్మాణం

సాక్షి, అమరావతి/దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా­): గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభు­త్వం విశేష ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా పెద్దఎత్తున కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ప్రధానంగా పట్టణాలతో వాటి సమీపంలోని గ్రామాలను కలిపే ప్రక్రియ­కు శ్రీకారం చుడుతోంది. 20 రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కు­వగా ఉండే 202 రోడ్లను రూ.784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతో పాటు పునర్నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు వీటికి అదనంగా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో 916.22 కిలోమీటర్ల పొడవున మరో 115 తారు రోడ్లను కొత్తగా నిర్మించనుంది. వీటికితోడు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రోడ్ల మార్గమధ్యంలో ఉండే 72 పెద్దస్థాయి వంతెనలను కూడా పునర్నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెండ్రోజుల క్రితం ఆదేశాలు జారీచేశారు.

ఈ 72 వంతెనల పొడవే 6.670 కిలోమీటర్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇక కొత్తగా నిర్మించ తలపెట్టిన 916.22 కి.మీ. రోడ్ల నిర్మాణానికి రూ.576.15 కోట్లు.. 72 వంతెనల నిర్మాణానికి ఇంకో రూ.469.29 కోట్లు కలిపి ఈ విడతలో మొత్తం రూ.1,045.44 కోట్లు ఖర్చుకానుంది.

త్వరలోనే టెండర్ల ప్రక్రియ: డిప్యూటీ సీఎం  
ఇక కొత్తగా 115 తారురోడ్ల నిర్మాణంతో పాటు 72 పెద్దస్థాయి వంతెనల పునర్నిర్మాణానికి సంబంధించి మొత్తం 187 అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో  మాట్లా­డారు.

ఈ పనులకు సంబంధించి ఆర్థి క శాఖ నుంచి పరిపాలన ఆమో­దం లభించిన అనంతరమే ఉత్తర్వులు వెలువడ్డాయని, టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేసి వీలైనంత త్వరగా పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రోడ్ల అభివృద్ధికి ఒకేసారి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కు దక్కుతుందన్నారు. రోడ్ల అభివృద్ధి పనులతోపాటు వంతెనల నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ప్రజలకు రహదారి కష్టాలు తీరుతాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top