బాబు వాడుకున్నారు.. జనం ఆడుకున్నారు | Sakshi
Sakshi News home page

బాబు వాడుకున్నారు.. జనం ఆడుకున్నారు

Published Fri, Jan 6 2023 7:57 AM

Netizens Trolls On Fake Photos Of Chandrababu Kuppam Sabha - Sakshi

సాక్షి, అమరావతి: జనాదరణ పోయింది. పిలిచినా సభలకు రావటం లేదు. దీంతో ఒకరోజు ఇరుకు సందుల్లోనే సభ పెట్టబోయారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆ సాహసానికి.. పాపం 8 మంది అమాయకులు బలైపోయారు. జనం రద్దీ బాగా కనిపించే డ్రోన్‌షాట్ల కోసం ఇరుకు రోడ్లోకి వాహనాన్ని పోనిచ్చి... అక్కడ చంద్రబాబు మాట్లాడబోగా, అప్పటికే ఉన్న జనం వెనక్కివెళ్లే తొందర్లో ఒకరిపై ఒకరు పడి... పాపం ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాన్ని రప్పించడానికి వారికి కానుకల ఆశ చూపించారు చంద్రబాబు. విలువైన చీర, ఇతర సరుకులు ఇస్తా­మని నమ్మబలికి టోకెన్లు పంచి మరీ వేల మందిని రప్పించారు. కానీ చౌకబారు చీరలతో నాసిరకం కా­ను­కలిచ్చారు. అది కూడా టోకెన్లున్న వారంద­రికీ ఇవ్వకపోవటంతో అక్కడా తోపులాట తప్ప­లేదు.

పాపం.. మరో ముగ్గురు బలైపోయారు. 
ఎలాగైనా తమకు జనాదరణ తగ్గలేదని చూపించడానికి చంద్రబాబు ముఠా ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా వేదికగా మరో దుస్సాహసానికి దిగింది. చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారంటూ సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలను ఈ ముఠా వైరల్‌ చేసింది. ‘కుప్పం గడ్డ.. ఇది చంద్రబాబు అడ్డా’ అనే నినాదాలతో విపరీతంగా జనం కనిపిస్తున్న ఆ ఫొటోలను కొన్ని ఎల్లో చానళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇక సోషల్‌ మీడియాలో అయితే టీడీపీ బ్యాచ్‌ మొత్తం ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ శివాలెత్తిపోయింది. బాబును ప్రభుత్వం ఎంతలా అడ్డుకున్నా జనం ఆయన వెంటే ఉన్నారంటూ కామెంట్లు కూడా ఊదరగొట్టేశారు. కానీ నిజమేంటో తెలుసా? ఆ ఫొటోలు కుప్పంలోనివి కాదు. 

అసలు చంద్రబాబుకే కాదు.. ఈ రాష్ట్రానికే సంబంధం లేని ఫొటోలు. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రముఖుడిగా గుర్తింపు పొందిన సిద్ధేశ్వర స్వామి సోమవారం మరణించగా.. ఆయన అంతిమ యాత్రకు దాదాపు 2 లక్షల మంది భక్తులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. లింగాయత్‌ సంప్రదాయానికి చెందిన సిద్ధేశ్వర స్వామి.. దశాబ్దాల పాటు సమాజానికి విశేష సేవలు అందించి కర్ణాటక వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందటంతో జనం తండోపతండాలుగా వచ్చారు. భక్తుల్లో చాలామంది పసుపు రంగు దుస్తులు ధరించి ఉండటం.. వాహనానికి కూడా పసుపు రంగు ఉండటంతో ఇది తమకు సరిగ్గా మ్యాచ్‌ అవుతుందనుకున్న టీడీపీ వర్గాలు.. ఆ ఫొటోలను, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి తమ బాబు సభకు వచ్చిన జనం అంటూ వైరల్‌ చేసేశాయి. 

ఏకి పారేసిన నెటిజన్లు..
ఆ ఫొటోల లోగుట్టును నెటిజన్లు క్షణాల్లోనే పట్టేశారు. ఆ ఫొటోలు కుప్పంలో చంద్రబాబు పర్యటనవి కావంటూ నిజాన్ని నిగ్గు తేల్చారు. చుట్టుపక్కల పరిసరాలు, ఆ ఫొటోల్లో ఉన్న ప్రజల ఆహార్యాన్ని గుర్తించిన ప్రజలే.. ఇవి ఫేక్‌ అంటూ ఎండగట్టే సరికి పచ్చ గ్యాంగ్‌కు దిమ్మ తిరిగిపోయింది. ‘బాబు మరీ ఇంత ఫేకా’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. నిజానికి 1989 నుంచీ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం స్థానంలో ఇపుడు టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జెడ్పీ­టీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న తరుణంలో మూడు రోజుల పర్యటనకు గాను చంద్రబాబు బుధవారం కుప్పంలో అడుగు­పెట్టారు. బాబు వస్తున్నారని వారం పది రోజులుగా ఎంత ప్రచారం చేసినా, అక్కడి ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కనిపించ లేదు. దీంతో ఫొటోల మార్ఫింగ్‌కు దిగారు టీడీపీ ఘనులు. అయినా జనం వచ్చేది నాయకులు చేసే మంచిని చూసి. మరి చంద్రబాబు ఏం చేశారని వస్తారు?.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement