కలెక్టర్‌ గారూ.. మీకిది తగునా! | Nellore District Collector Anand Support To Ruling Party | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ గారూ.. మీకిది తగునా!

Jan 29 2025 1:11 PM | Updated on Jan 29 2025 1:32 PM

Nellore District Collector Anand Support To Ruling Party

రెడ్‌క్రాస్‌కు రాజకీయాలతో సంబంధం ఉండకూడదన్నారు 

ఎన్నికల్లో మంత్రి నారాయణ సభల్లో విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు 

మరి.. ఆయనకు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పదవి ఎలా ఇచ్చారు?

ఈ ఫొటోలో మంత్రి నారాయణ పక్కన ఉన్నది వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి. ఆయన గతంలో ప్రైవేట్‌ విద్యాసంస్థకు అధిపతిగా ఉండేవారు. తర్వాత విద్యాసంస్థను వదిలేసి నారాయణకు ఆప్తుడయ్యారు. ఆ క్రమంలోనే  2024 ఎన్నికల్లో పలుచోట్ల బహిరంగ సభల్లో నారాయణతో పాల్గొన్నారు. ఫొటోలు దిగారు. ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాలతో మాట్లాడి ఒకచోట సభను పెట్టించారు. ఈ క్రమంలో తనకున్న అనుభవంతో ప్రైవేటు విద్యాసంస్థల వారిని నారాయణకు ఓటు వేసేలా కృషి చేశారు.  నారాయణ గెలుపు కోసం వాకాటి విజయకుమార్‌రెడ్డి పాంప్లెట్స్‌ వేయించారు. వాటిలో తన వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ను ప్రింట్‌ చేయించారు. ఆయన గెలుపు కోసం బహిరంగంగా పని చేశారు. 

నా విజయానికి నీవు సహకరిస్తే.. నీకు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పదవి కట్టబెడతా.. ఇలా ముందస్తుగా అనుకున్న పథకం ప్రకారమే పదవి వాకాటి విజయకుమార్‌రెడ్డిని వరించిందా అంటే అవుననే విశ్లేషకులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయాలని ప్రత్యక్ష   రాజకీయాలు చేసిన వాకాటికి కలెక్టర్‌ ఆనంద్‌ రెడ్‌క్రాస్‌ ఎన్నికల్లో సహకారమందించారనేది నగ్నసత్యం. మంత్రి నారాయణ ఒత్తిడి పెట్టినంత మాత్రాన కలెక్టర్‌ ఒక పార్టీకి కొమ్ము కాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెడ్‌క్రాస్‌ అంటే సేవ చేసే సంస్థ అని ఇందులో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వారు ఉండకూడదని నిబంధనల పేరిట కలెక్టర్‌ ఆనంద్‌ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేకర్‌రెడ్డితో పాటు మరో నలుగురు ఎంసీ మెంబర్లకు నోటీçసులు ఇచ్చారు. వారు అందుకు తగిన వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ సంతృప్తి చెందని కలెక్టర్‌ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీకి అనుకూలురంటూ ముద్రవేసి మిగతా మేనేజింగ్‌ కమిటీ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, మలిరెడ్డి కోటారెడ్డి, నేతాజి సుబ్బారెడ్డి తదితరులను తొలగించడమే కాకుండా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేశారు. 

అయితే కోర్టుకెళ్లి తిరిగి విజయాన్ని సాధించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరులు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇప్పటికీ రెడ్‌క్రాస్‌ సభ్యులుగా కొనసాగుతున్నప్పటికీ వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కలెక్టర్‌ రద్దు చేయలేదు.  

చట్టబద్ధంగా గెలిచినా..  
రెడ్‌క్రాస్‌లో ఉన్న 8వేల ఓట్లలో 6వేల ఓట్లు సాధించి రెడ్‌క్రాస్‌ చైర్మన్, ఎంసీ పదవులు దక్కించుకున్నప్పటికీ కలెక్టర్‌ ఆనంద్‌ వారిని తొలగించారు. మంత్రి అనుచరుడిగా ఉన్న వాకాటి విజయకుమార్‌రెడ్డిని కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు సహకరించారు. మరి మంత్రి నారాయణతో ఫొటోలు దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని, వ్యక్తిగత నంబర్‌ కూడా పాంప్లెట్స్‌లో ఇచ్చిన వాకాటి విజయకుమార్‌రెడ్డి మాత్రం కలెక్టర్‌కు ఎలా రాజకీయేతరుడుగా కనిపించారో తెలియడం లేదు. పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. అధికారులు ఎక్కడికెళ్లినా శాశ్వతం. మరి అలాంటి అధికారులు ఒత్తిడికి తలొగ్గితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం సందేహమే.  


 

Advertisement
 
Advertisement
Advertisement