శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే

Navratri 2020: Nine Avatars Of Durga Maa - Sakshi

దసరా స్పెషల్‌ స్టోరీ

సాక్షి, విజయవాడ : శ‌ర‌న్న‌వ‌రాత్రుల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా తొలి రోజు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ భ‌‌క్తుల‌కు స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత శ్రీ దుర్గాదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అష్ట భుజాల‌తో సింహాస‌నం మీద త్రిశూల‌ధారియై.. క‌న‌క‌పు ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిసిపోయే ఆ త‌ల్లిని ద‌ర్శించుకోవ‌డం నిజంగా భ‌క్తుల‌కు క‌నుల పండగే. ఈ అలంకారంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ద‌రిద్రాలూ తొల‌గిపోతాయంటారు. ఇలా నవరాత్రుల్లో క‌న‌క‌దుర్గ‌మ్మ  అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అవేంటంటే...

రెండో రోజు..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవరోజు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. చదవండి: కోవిడ్‌ నియమాలతో దసరా ఉత్సవాలు..

మూడో రోజు..
దుర్గగుడిలో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. చదవండి: అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు

నాలుగో రోజు..
దసరా వేడుకల్లో అమ్మవారు నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చదవండి: స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గాదేవి

అయిదవ రోజు:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాదనలు ముమ్మరమవుతాయి. 

ఆరవ రోజు..
అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. 

ఏడోరోజు..
ఉత్సవాల్లో ఏడో రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

ఎనిమిదవ రోజు..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. 
     
తొమ్మిదవ రోజు..
దసరా నవరాత్రి వేడుకల ముగింపు నాడు విజయదశమి రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమివ్వనున్నారు. దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో తొమ్మిదో రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. 
     
ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top