రేపటి నుంచి నవరాత్రి మహోత్సవాలు

Navaratri Celebrations From 7th October Vijayawada Indrakeeladri - Sakshi

ఈనెల 15 వరకు ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహణ 

రోజుకు 10 వేలమంది భక్తులకు అనుమతి 

12న మూలానక్షత్రం 

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి (గురువారం) నుంచి ఈనెల 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల్లో కనకదుర్గ అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రోజుకు 10 వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా టైం స్లాట్‌ ప్రకారం దర్శనం టిక్కెట్లు ఇస్తున్నారు.

గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, తరువాత అన్ని రోజులు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనం లభించనుంది. మూలానక్షత్రం రోజు 12వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. 15వ తేదీ విజయదశమి పర్వదినాన సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంస వాహనంపై దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో జలవిహారం చేస్తారు. ఊరేగింపులను ఆలయ ప్రాంగణం, పరిసరాలకే పరిమితం చేస్తున్నారు.   
విద్యుత్‌ దీపాలతో అలంకరించిన కనకదుర్గ అమ్మవారి ఆలయం  

5 క్యూలైన్‌ల ఏర్పాటు 
ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మొత్తం ఐదు క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. వినాయకగుడి నుంచి టోల్‌గేటు ద్వారా కొండపైన ఓం టర్నింగ్‌ వరకు మూడు క్యూలైన్‌లు, అక్కడి నుంచి అదనంగా ఉచిత దర్శనం లైను ఒకటి, వీఐపీ లైను ఒకటి సిద్ధం చేశారు. దర్శనానంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దర్శనానంతరం కొండ దిగువన మహామండపం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాట్లు చేశారు.

13 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి, 10 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఆలయ పరిసరాలను విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. కొండపైన, దిగువన సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. పున్నమి, భవాని ఘాట్‌లలో భక్తులు నదిలో స్నానం చేసే అవకాశం ఉన్నందున ఆ మార్గాలను మూసివేశారు. ఉత్సవాలకు 3 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.  

7 నుంచి శారదాపీఠంలో 
పెందుర్తి: శరన్నవరాత్రి ఉత్సవాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ముస్తాబైంది. ఈ నెల 7న పీఠంలో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 15 వరకు పీఠం అధిష్టాన దేవత శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు రోజుకో అవతారంలో పూజలందుకుంటారు. తొలిరోజు గురువారం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు. లోకకల్యాణం కోసం పీఠంలో శ్రీమత్‌ దేవి భాగవత పారాయణం చేపట్టనున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి నిజరూపాన్ని వీక్షించే అవకాశం ఉంటుందని పీఠం ప్రతినిధులు వెల్లడించారు.

అమ్మవారి అవతారాలు..
ఉత్సవాల్లో అమ్మవారు గురువారం బాలత్రిపుర సుందరిదేవిగా, శుక్రవారం మహేశ్వరిగా, శనివారం వైష్ణవిదేవిగా, ఆదివారం అన్నపూర్ణ దేవిగా, సోమవారం లలితా త్రిపురసుందరిదేవిగా, మంగళవారం మహాసరస్వతిదేవిగా, బుధవారం మహాలక్ష్మిగా, గురువారం మహిషాసుర మర్ధినిగా, శుక్రవారం విజయదుర్గగా దర్శనమిస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top