ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు  | Sakshi
Sakshi News home page

ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు 

Published Mon, Aug 8 2022 4:50 AM

Natural products for temples - Sakshi

సాక్షి, అమరావతి: ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీతో రైతు సాధికార సంస్థ గతేడాది అక్టోబర్‌లో చేసుకున్న ఒప్పందం మేరకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం ప్రకృతి సిద్ధంగా పండించిన శనగలను మార్క్‌ఫెడ్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటిని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పండించేలా ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన రైతులకు రైతు సాధికార సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చారు.

వీటిని కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనపు ధర చెల్లించి మరీ సేకరించారు. వాటి నమూనాలను థర్ట్‌ పార్టీ ఏజెన్సీ ద్వారా పరీక్షించి ధ్రువీకరించిన తర్వాత టీటీడీకి సరఫరా చేస్తున్నారు. ఇలా 10 నెలల్లో రూ.7.52 కోట్ల విలువైన 1,306 టన్నుల శనగలను టీటీడీకి సరఫరా చేశారు. టీటీడీ సూచన మేరకు స్వామివారి నైవేద్యం, ప్రసాదాలతో పాటు నిత్యాన్నదానం కోసం 2022–23 సీజన్‌లో 24,728 టన్నుల 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరో 8 ఆలయాలకు ఉత్పత్తులు 
ఇదే స్ఫూర్తితో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, పెనుగంచిప్రోలు, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ఆలయాల్లో ప్రసాదం, నైవేద్యం, నిత్యాన్నదానం కోసం రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను ప్రోసెస్‌ చేసి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా సరఫరా చేయనున్నారు. ఇందుకోసం గుర్తించిన రైతులకు  రైతు సా«ధికార సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వీరు పండించిన ఉత్పత్తులకు భారతీయ సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాల సంస్థకు చెందిన ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అండర్‌ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్‌ (పీజీఎస్‌) ద్వారా సర్టిఫికేషన్‌ చేయించి మరీ ఆలయాలకు సరఫరా చేయనున్నారు. ఈ మేరకు దేవదాయ, వ్యవసాయ శాఖ మంత్రుల సమక్షంలో ఆయా దేవస్థానాలు, రైతు సాధికార సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్‌ మంగళవారం అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement