Natural Farming: ఐదంతస్తులతో ఆదాయ మస్తు!

Natural Farming: Five Stages Cultivation in Kurnool District - Sakshi

ప్రకృతి వ్యవసాయంలో వినూత్న ప్రయోగం

ఐదంతస్తుల నమూనాలో పంటల సాగు

గ్రామీణాభివృద్ధి శాఖ తోడ్పాటు

ఎకరాకు రూ.1.64 లక్షల వరకు ప్రోత్సాహకం

కర్నూలు(అగ్రికల్చర్‌): ఏ రంగంలోనైనా రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. ఇది వ్యవసాయ రంగానికీ వర్తిస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు మాత్రం క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే ఐదంతస్తుల పంటల సాగు నమూనా. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని కర్నూలు జిల్లాలో ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

రైతులకు తోడ్పాటు
ఐదంతస్తుల విధానంలో పంటలు సాగు చేసే రైతులకు తగిన తోడ్పాటు అందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే.. వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యాచరణకు దిగారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 1,500 మంది రైతులతో ఐదంతస్తుల విధానంలో పంటలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 754 ఎకరాల్లో సాగుకు రంగం సిద్ధమైంది. ఒక్కొక్క రైతుతో గరిష్టంగా ఎకరా వరకు సాగు చేయిస్తున్నారు. ఇందుకు గాను జాతీయ గ్రామీణ  ఉపాధి హామీ పథకం కింద రైతుకు ఎకరాపై మూడేళ్లకు గాను రూ.1.64 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈ విధానంలో వేసిన పంటలను జియో ట్యాగింగ్‌ సైతం చేస్తున్నారు. 

స్వచ్ఛందంగా సాగు
రెండేళ్ల క్రితమే జిల్లాలో పలువురు రైతులు స్వచ్ఛందంగా ఐదంతస్తుల విధానంలో పంటల సాగు చేపట్టారు. గూడూరు, ఓర్వకల్లు, మిడుతూరు, ప్యాపిలి, కల్లూరు, కర్నూలు తదితర మండలాల్లో దాదాపు 200 ఎకరాల్లో ఈ విధానంలో పంటలు సాగులో ఉన్నాయి. ఇది సత్ఫలితాలు ఇస్తోంది. పలువురు నిపుణులు సైతం ఈ విధానాన్ని పరిశీలించి రైతులకు లాభదాయకమని తేల్చారు. భూమి, నీరు, సూర్యరశ్మిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంటలు సాగుచేసే ఈ పద్ధతి ద్వారా కరువును ఎదుర్కోవచ్చునని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది.

30 సెంట్లలో సాగు చేశా 
ఐదంతస్తుల విధానంలో 30 సెంట్లలో పంటలు సాగు చేశా. ఇప్పటికి రెండేళ్లు పూర్తయ్యింది. పూర్తిగా ప్రకృతి వ్యవసాయమే. అన్ని ఖర్చులు పోను రూ.40 వేల వరకు నికరాదాయం వస్తోంది. కుటుంబానికి అవసరమైన కూరగాయలు లభిస్తున్నాయి. పలువురు ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు కూడా పరిశీలించి వెళ్లారు. ఇప్పుడు ‘ఉపాధి’ నిధులతో ప్రోత్సాహకాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో మరికొంత విస్తీర్ణంలో సాగు చేయాలనుకుంటున్నా. 
– యు. మాదన్న
నాగలాపురం, గూడూరు మండలం 

ఉపయోగాలివీ..
► ఐదంతస్తుల విధానంలో పంటలు వేయడం వల్ల  రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది.
► పండ్లతోటలు, ఇతర వృక్షాలను పెంచడం ద్వారా వర్షాలను ఆకర్షించే అవకాశం ఉంటుంది.
► తక్కువ నీటి వినియోగంతోనే ఎక్కువ పంటలు పండించవచ్చు.

ఐదంతస్తుల నమూనా ఇలా..
► 1వ అంతస్తు కింద 36 అడుగుల విస్తీర్ణంలో మామిడి చెట్లు నాటాలి. ఇవి ఐదారేళ్లలో కాపునకు వస్తాయి.

► 2వ అంతస్తు 18 అడుగులు.. ఇందులో మోసంబి, అంజూర వేసుకోవచ్చు. మోసంబి 4–5 ఏళ్లలో, అంజూర ఐదో ఏడాది నుంచి కాపునకు వస్తాయి.
     
► 3వ అంతస్తు 9 అడుగులు ఉంటుంది. ఇందులో జామ, మునగ, కంది, బొప్పాయి, అరటి వేసుకోవచ్చు. జామ, మునగ, కంది ఆరు నెలలకు కాపునకు వస్తాయి. బొప్పాయి 9 –10 నెలలకు, అరటి ఏడాదిలోపు కాపునిస్తాయి.
     
► 4వ అంతస్తు 4–5 అడుగులు. కూరగాయలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, దుంపజాతి కూరగాయలు సాగు చేయవచ్చు.      

► 5 అంతస్తు 2.5 అడుగులు. తీగజాతి, దుంపజాతి కూరగాయలు వేసుకోవచ్చు. ఇవి 3–4 నెలల్లో కాపునకు వస్తాయి. అంటే ఐదంచెల ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏడాది పొడవునా పంటలు ఉంటాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top