నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్‌ | Nallapareddy Prasanna Kumar Allegations On Vemireddy Prashanthi Reddy | Sakshi
Sakshi News home page

నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్‌

Jul 8 2025 8:04 AM | Updated on Jul 8 2025 10:40 AM

Nallapareddy Prasanna Kumar Allegations On Vemireddy Prashanthi Reddy

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో పచ్చ మూకల దాడిపై ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే ఆయనను కచ్చితంగా హత్య చేసేవారిని అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న రాత్రి నా నివాసం పై జరిగిన దాడి నన్ను హతమార్చడానికే అని అర్థమవుతోంది. నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నా తల్లిని బెదిరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు వాసులు అందరికీ తెలిసిన విషయమే. నేను చేసిన ప్రతీ వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నాను. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇటువంటి దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చుని పోవటం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

మరోవైపు.. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ..‘200 మంది అరాచక వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించారు. కంటికి కనపడిన వస్తువులు అన్నింటినీ ధ్వంసం చేశారు. నీ కుమారుడు ఎక్కడ అంటూ నన్ను బెదిరించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యాను. ఇలాంటి దాడులు ఏనాడు చూడలేదు. నా కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే అతన్ని చంపేసేవారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 

మారణాయుధాలతో దాడి..
ఇదిలా ఉండగా.. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమ­యంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్‌ తలు­పులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభా­గంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టిం­చారు. కంటి ఆపరేషన్‌ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్ట­బోమని దుండగులు హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి

అయితే, పోలీసులు వస్తున్నా­రని తెలుసుకుని దుండగులు బైక్‌లపై పరార­య్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్‌శ్‌ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రసన్నను హత్య చేసేందుకేనా?
దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకు­మా­ర్‌రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగ­ట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణా­యుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్న­కుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement