నెలాఖరుకు అద్దాల్లా ఆశ్రమ పాఠశాలలు

Nadu Nedu Work Is In Full Swing At Ashram Schools In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులు ఈనెలాఖరుకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అన్ని వసతులతో రూపుమార్చుకుంటున్న ఈ పాఠశాలలు అద్దాల్లా మారుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 378 ఆశ్రమ పాఠశాలలున్నాయి. ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతంలోను, నల్లమల అడవుల్లోను ఉన్నాయి. 31 ప్రభుత్వ భవనాలు, రెండు అద్దె భవనాలు, ఒక అద్దెలేని భవనం కలిపి 34 మినహా మిగిలిన 344 స్కూళ్లలో నాడు–నేడు పనులు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో చాలా పాఠశాలలకు ఇప్పటివరకు ప్రహరీలు లేవు. జంతువుల భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పగటిపూటే ఎలుగుబంట్లు, చిరుతపులులు పాఠశాలల పరిసరాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రతి పాఠశాలకు ప్రహరీ నిర్మిస్తుండటంతో ఈ సమస్య తీరనుంది. ప్రహరీ నుంచి లోపలికి రోడ్డు వేసి ఆటస్థలాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. స్నానాల గదుల్లో టైల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లు, వాష్‌బేసిన్లు విద్యార్థుల సంఖ్యను బట్టి ఏర్పాటు చేస్తున్నారు. డైనింగ్‌ హాల్స్‌ రూపుదిద్దుకుంటున్నాయి. 

16 నుంచి ప్రారంభమైన 9, 10 తరగతులు
ఆశ్రమ పాఠశాలలు గురుకుల విద్యాలయాలను పోలి ఉంటాయి. విద్యార్థులు రాత్రిపూట ఇంటికి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఉపాధ్యాయులు కూడా రాత్రి వరకు ఉండి ఇంటికి వెళతారు. విద్యావిధానం గురుకుల పాఠశాలల్లో మాదిరే ఉంటుంది. ఆశ్రమ పాఠశాలల్లో ఈనెల 16 నుంచి 9, 10 తరగతులు మొదలయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన క్లాసుల వారికి ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న 179 ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో నాడు–నేడు పనులు పూర్తికావచ్చాయి. ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు 21, పోస్టు మెట్రిక్‌ హాస్టల్స్‌ 158 ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top