సీఎం జగన్ కలిసిన విలీన మండలాల మున్నూరు కాపు సంఘం నేతలు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విలీన మండలాల మున్నూరు కాపు సంఘం నేతలు సోమవారం కలిశారు. తమకు బీసీ-డీ సర్టిఫికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ను నేతలు కలిశారు.
చదవండి: మా ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా? చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్
అనంతరం.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ, విలీనం తర్వాత ఎన్ని సార్లు చంద్రబాబుకి చెప్పుకున్నా ఫలితం లేదన్నారు. వరద పర్యటన సమయంలో సీఎం జగన్‌ను కలిసిన మున్నూరు కాపులు.. బీసీ-డీ కింద చేర్చాలని, తెలంగాణలో ఉన్న పరిస్థితిని విన్నవించారన్నారు. విలీన మండలాల్లో ఉన్న మున్నూరు కాపులను బీసీ-డీ కిందకు తీసుకురావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు.
కాపు నేస్తం రూపకర్త సీఎం వైఎస్ జగన్.. ఆర్థికంగా వారిని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం ఇలా అన్ని సమస్యలు తీరుస్తుంటే ప్రతిపక్షాలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు. జనసేన పార్టీ నాయకుడు ఎక్కడా కాపుల కోసం పోరాడింది లేదని.. చంద్రబాబు కాపుల ఆత్మగౌరవాన్ని రోడ్డుకు ఈడ్చాడని ఆయన దుయ్యబట్టారు.
బతికున్నంత వరకూ సీఎం జగన్ వెంటే..
మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఉమాశంకర్ మాట్లాడుతూ, బతికున్నంత వరకూ సీఎం జగన్ వెంటే నడుస్తామన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఆశలు చిగురించాయి..
మున్నూరు కాపు నాయకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. మాలో ఆశలు చిగురించాయన్నారు. తమకు మున్నూరు కాపు సర్టిఫికేట్ బీసీ-డీ కింద వచ్చిందన్నారు.