ఇఫ్తార్‌ విందులో వైఎస్‌ జగన్‌ | YS Jagan: YSRCP Iftar Dinner for Muslim Brothers in Vijayawada | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందులో వైఎస్‌ జగన్‌

Mar 19 2026 5:11 AM | Updated on Mar 19 2026 5:11 AM

YS Jagan: YSRCP Iftar Dinner for Muslim Brothers in Vijayawada

విజయవాడలో ముస్లిం సోదరులతో కలిసి దువా చేస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

ఈద్‌ ముబారక్‌... అంటూ రంజాన్‌ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు విజయవాడలో వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్‌ విందు

ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలోనూ భారీగా హాజరు

వైఎస్‌ జగన్‌ సీఎం కావాలంటూ దువా చేసిన ముస్లిం మత పెద్దలు

సాక్షి, అమరావతి: ‘‘సబ్‌కో అస్సలామ్‌ అలై కుమ్‌.. (అందరికీ అల్లా కృప ఉండాలి).. అడ్వాన్స్‌ ఈద్‌ ముబారక్‌ (ముందస్తు రంజాన్‌ శుభాకాంక్షలు)..’’ అంటూ ముస్లిం సోదరు­లకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్‌ జగన్‌కు ముస్లిం మతపెద్దలు, నేతలు చౌకత్‌తో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. 

ఈ  సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి వైఎస్‌ జగన్‌ ప్రార్థనలు (నమాజ్‌) నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షను విరమింపజేస్తూ వైఎస్‌ జగన్‌ వారికి ఖర్జూరం తినిపించారు. ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నేతలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ అందరికీ ముందస్తుగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్‌ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.
ఇఫ్తార్‌ విందులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయంగా ఖర్జూరం తినిపిస్తున్న ముస్లిం సోదరులు  

జగన్‌ సీఎం కావాలంటూ ‘దువా..’
మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాదర్‌బాషా, ఎంఎస్‌ మక్బూల్, పలు జమాత్‌ల పెద్దలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మైనార్టీలను ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వైఎస్‌ జగన్‌ చేయిపట్టుకుని ముందుకు నడిపించారన్నారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన వైఎస్‌ జగన్‌కు అల్లా దయ, అందరి ప్రేమాభిమానాలు ఉంటాయన్నారు. కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌ అంటూ దువా (ప్రార్థన) చేశారు.
ఇఫ్తార్‌ ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
 
హోరెత్తిన అభిమానం..

వైఎస్‌ జగన్‌ను చూసేందుకు విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ వద్దకు భారీగా తరలివచ్చిన ప్రజలు    

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇఫ్తార్‌ విందుకు అభిమాన జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షులు ఖాదర్‌బాషా, ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, ఇస్సాక్‌ బాషా, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రమేష్‌యాదవ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్‌ ఖాన్, అత్తర్‌ చాంద్‌బాషా, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పి.గౌతంరెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, ముస్లిం నేతలు మక్బుల్, నదీమ్‌ అహ్మద్, అసిఫ్, అహ్మద్‌ అలీ, ఫారుఖీ, షేక్‌ మునీర్‌ అహ్మద్‌ తదితర జమాత్‌ల పెద్దలు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement