
నేటి అర్ధరాత్రి నుంచి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగిన కార్మికులు
బైక్ ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిన పట్టణాలు, నగరాలు
సాక్షి, అమరావతి/ఏలూరు(టూటౌన్)/భీమ వరం: సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు శనివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. జీవో ఎంఎస్ నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచి చెల్లించాలని, కేటగిరీల నిర్ణయంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, గతంలో జరిగిన సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని, రిటైర్మెంట్ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యూటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైనట్టు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నాగభూషణ, కె.ఉమామహేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటి నుంచి ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని విమర్శించారు. ఇప్పటివరకు శాంతియుతంగా నిరసన తెలియజేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్టు వివరించారు. వెంటనే సర్కారు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే వీరికి మద్దతుగా జూలై 16 నుంచి పారిశుద్ధ్య కార్మికులూ సమ్మెకు దిగుతారని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు
కాగా, రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కార్మికులు ధర్నాలు, మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహించారు. దీంతో పట్టణాలు, నగరాలు హోరెత్తాయి. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి జ్యోతిబసు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన ర్యాలీలో విశాఖ నగర యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి అధ్యక్ష, కార్యదర్శులు, టి.నూకరాజు, ఉరుకూటి రాజు పాల్గొన్నారు. మార్కాపురం, నంద్యాల, తాడిపత్రి, బాపట్ల, కడప, ప్రొద్దుటూరు, నందిగామ తదితర ప్రాంతాల్లో కార్మికులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని కార్మికులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు.
ఏఐటీయూసీ, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎ.అప్పలరాజు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద కూడా కార్మికులు ధర్నా చేశారు. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కిలారి మల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తాడికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్మికులు డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.