ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి

MP Vijayasai Reddy Speaks On Parliament Monsoon Session YSRCP Agenda - Sakshi

సాక్షి, విజయవాడ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని వైఎస్సార్‌సీసీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరతామని, ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ మొదట్నుంచీ పోరాడుతుందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పోలవరం సవరించిన అంచనాల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ పెండింగ్‌ నిధుల అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్‌లను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని, కేఆర్‌ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కోరతామని పేర్కొన్నారు. 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణ నుంచి రూ.6,112 కోట్లు విద్యుత్‌ బకాయిలు రావాలన్నారు.  తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 12సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దిశ చట్టాన్ని ఆమోదించాలని కోరతాంమని, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం పీఎంఏవై కింద నిధులు ఇవ్వాలని కోరతామని తెలిపారు. ట్రైబల్‌ యూనివర్శిటీని నాన్‌ట్రైబల్‌ ఏరియాలో కేటాయించారని, దాన్ని సాలూరులో పెట్టాలని కోరతామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జూలై 19 న ప్రారంభమై ఆగస్టు 13 తో ముగియనున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top